అమావాస్య అంటేనే చాలామంది భయపడతారు. ఆరోజు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే చెడు జరుగుతుందనే భావనలో ఉండటంతోపాటు రకరకాల ఆచారాలు పాటిస్తారు. వాస్తవానికి అమావాస్య చాలా మంచిది.
మన పొరుగునే ఉన్న తమిళనాడు ప్రజలకు అమావాస్య వచ్చిందంటే సంక్రాంతి పండగతో సమానం. ఈనెల 21న ఆదివారం అమావాస్య వచ్చింది. ఆరోజును రవి అమావాస్య అంటారు. చంద్రుడి శక్తి తగ్గుతుంది. భాద్రపద నెలలో చివరిరోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఆరోజు ఎటువంటి దానం చేసినా, మంచి పనులు చేసినా, పూజలు చేసినా విశేషమైన ఫలితాలనిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఆదివారం అమావాస్య ప్రత్యేకత
పితృ దేవతలకు సూర్యుడు చిహ్నంగా నిలుస్తాడు. చంద్రుడు మనసుకు కారకుడు. పూర్వీకులకు సంబంధించి, భావోద్వేగాలకు సంబంధించి ప్రతీకగా నిలుస్తాడు. ఈ రెండు గ్రహాలు ఆరోజు కలవడంవల్ల పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. అలా చేయడానికి ఆదివారం అమావాస్యకు మించిన మంచిరోజు లేదు. తర్పణాలు విడవడంవల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. అనేక దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. జాతకంలో చంద్ర దోషం లేదంటే సూర్య దోషం ఉన్నవారు. 21వతేదీన పరిహారాలు పాటించడంవల్ల మంచి జరుగుతుంది.
పాటించాల్సిన నియమాలు, పరిహారాలు
నదిలో లేదంటే చెరువులో స్నానంచేసి పితృదేవతలకు నువ్వులతో తిలోదకం ఇవ్వాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని బెల్లం, కుంకుమ, ఎర్రటిపూలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆరోజు ఆదిత్య హృదయం పఠించాలి. దానధర్మాలు చేయడంతోపాటు ఎర్రటి వస్త్రాలు, గోధుమలు, బెల్లం, నువ్వులు దానం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.
శివాలయాన్ని సందర్శించి సూర్యుడికి పూజలు చేస్తే అనేక దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అమావాస్య ఆదివారం రోజు విష్ణువును, శివుణ్ని పూజిస్తే చాలా మంచిది. కర్పూరం తీసుకొని ఆదివారం రోజు ఇంటిచుట్టూ తిప్పి ఇంటికి బయట కాల్చేయాలి. నల్ల నువ్వులు, ఎర్ర మిరపకాయలు కూడా ఇంటిచుట్టూ తిప్పి ప్రవహించే నీటిలో వదలాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
































