కొత్త రేషన్ కార్డులు వీరికే, పాతవి రద్దు – తాజా మార్గదర్శకాలు

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ పై కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయాలని నిర్ణయించింది.


పథకాల అమలు కోసం రేషన్ కార్డులు ప్రాతిపదిక కావటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఏడాది కాలానికి పైగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అదే సమయంలో అనర్హుల ఏరివేత పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డుల మంజూరు.. పంపిణీ పైన ప్రభుత్వ ముహూర్తం ఖరారు అయింది.

పాత కార్డుల స్థానంలో

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. పాత కార్డులను రద్దు చేసి.. వాటి స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. పూర్తిగా భద్రతా ఫీచర్లతో కార్డులు పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు దరఖాస్తు చేస్తున్నారు. కొన్నేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు పెండింగ్​లో ఉన్నాయి. కొత్తగా సభ్యుల చేరిక మొదలుకుని ఇప్పటికే మృతి చెందిన, వివాహమై వెళ్లిపోయిన సభ్యుల వివరాలను మార్చడం లేదు. దీంతో అక్కడక్కడా లబ్ధిదారుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయి.

వారి కార్డుల ఏరివేత

దీంతో, ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేసి కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెలాఖరు వరకు ఈకేవైసీ పూర్తి చేయటానికి గడువుగా నిర్ణయించారు. కొత్తగా కార్డుల మంజూరు కు ముందే.. ప్రస్తుతం కార్డులకు అర్హత లేకపోయినా కార్డులు ఉన్నవారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. క్షేత్ర స్థాయి నుంచి వారి వివరాలను సేకరించారు. జూన్ నెల నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. దీంతో, ఈ నెలాఖరు లోగా లబ్దిదారులు తమ కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన యాప్‌, రేషన్‌ షాపులోని E-Pos ద్వారా E-Kyc అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

రేషన్ కార్డులో పేరు నమోదైన 5 అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులు మినహా అందరూ ఈకేవైసీపీని పూర్తి పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒకే ఇంట్లో ఉంటూ రెండు నంబర్ల ద్వారా కార్డులు తీసుకున్న వారు, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను తొలగించకపోగా వారి పేరుతో రేషన్ సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈకేవైసీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే అనర్హులను ఏరివేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ విధానం వచ్చే నెలలో పూర్తి చేసి.. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.