డిసెంబర్ ముగిసి 2026 జనవరిలోకి అడుగుపెడుతున్న వేళ కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బ్యాంకింగ్ నుంచి సోషల్ మీడియా వరకు..
వేతనాల నుంచి రైతుల సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాదిని ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
1. బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుదల.. లోన్ తీసుకున్న వారికి పండగే!
RBI రెపో రేటును తగ్గించడంతో, చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. జనవరి 1 నుంచి హోమ్ లోన్, కార్ లోన్ , పర్సనల్ లోన్‌లపై వడ్డీ భారం తగ్గనుంది. ఇది కొత్తగా ఇల్లు కొనేవారికి , ఇప్పటికే లోన్ కడుతున్న వారికి గొప్ప వార్త అని చెప్పవచ్చు.
2. క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ ఇక మరింత వేగంగా
ఇప్పటివరకు క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల క్రెడిట్ హిస్టరీని 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేసేవి. కానీ January 2026 నుంచి ఈ నిబంధన మారబోతోంది. ఇప్పుడు ప్రతి వారం క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల లోన్ అప్లికేషన్లు వేగంగా ప్రాసెస్ అవుతాయి.
3. పాన్-ఆధార్ లింక్ కచ్చితం.. లేదంటే బ్యాంకింగ్ కట్!
మీరు ఇప్పటికీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే జాగ్రత్త. జనవరి 1 నుంచి లింక్ చేయని వారికి బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వారికి ఇది తప్పనిసరి.
4. మెసేజింగ్ యాప్స్ , సోషల్ మీడియాపై నిఘా
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. యూజర్ల సిమ్ వెరిఫికేషన్ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై కూడా ఆస్ట్రేలియా తరహాలోనే భారత్‌లో కూడా కఠినమైన ఆంక్షలు రానున్నాయి.
5. 8వ వేతన సంఘం (8th Pay Commission)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బిగ్ అప్‌డేట్. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో కొత్త ఏడాది నుంచి 8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఇది లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై సానుకూల ప్రభావం చూపనుంది.
6. రైతులకు శుభవార్త: పిఎం కిసాన్ , యూనిక్ ఐడి
రైతుల కోసం పిఎం కిసాన్ (PM Kisan) పథకంలో మార్పులు రానున్నాయి. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభించిన ‘యూనిక్ ఐడి కార్డ్’ విధానం దేశవ్యాప్తంగా అమలు కావచ్చు. ఇకపై అడవి జంతువుల దాడి వల్ల పంట నష్టం జరిగినా బీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సిద్ధంగా ఉండండి!
గ్యాస్ సిలిండర్ ధరలు, ఏటీఎఫ్ ఇంధన ధరలు కూడా జనవరి 1న సవరించబడతాయి. వీటితో పాటు డెలివరీ వాహనాలను పెట్రోల్/డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) మార్చాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. మొత్తానికి 2026 జనవరి సామాన్యుల జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు కొన్ని వెసులుబాట్లను కూడా తీసుకురానుంది.


































