ఆధార్ పై త్వరలోనే కొత్తరూల్.. ఇకపై మీ డేటా భద్రం

 హోటల్స్, ఈవెంట్ కంపెనీలు, జిమ్‌లు, ట్రావెల్ ఏజెన్సీలు.. ఇకపై ఎవరూ కస్టమర్ ఆధార్ కార్డు జిరాక్స్ లేదా ఫొటో తీసుకుని దాచుకోలేరు.


ఈ పాత పద్ధతి త్వరలోనే పూర్తిగా చరిత్రలో కలిసిపోనుంది. ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆధార్ యాక్ట్ ప్రకారం ఎవరి ఆధార్ కాపీనైనా కారణం చూపించకుండా సేకరించడం చట్టవిరుద్ధం. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా అమలు చేయడమే కాకుండా, పూర్తిగా డిజిటల్ వెరిఫికేషన్‌కు మార్చేస్తున్నారు. UIDAI కొత్తగా తెచ్చిన సిస్టమ్‌లో రెండు రకాల వెరిఫికేషన్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డులోని QR కోడ్ స్కాన్, రెండు త్వరలో రానున్న అత్యాధునిక మొబైల్ యాప్ ద్వారా రియల్-టైమ్ ధృవీకరణ. ఈ యాప్ ఒకసారి OTPతో వెరిఫై అయితే.. కస్టమర్ పేరు, ఫొటో, అడ్రస్ సంస్థకు కనిపిస్తాయి కానీ ఆ డేటా ఎక్కడా సేవ్ కాదు, ఎవరి సర్వర్‌లోనూ ఉండదు. అంటే డేటా లీక్ అవడం అసాధ్యం.

UIDAI అధిపతి భువనేశ్ కుమార్ ఇటీవల ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పేపర్ ఆధార్, ఫొటో ఆధార్ పద్ధతి పూర్తిగా ముగిసిపోతుంది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కూడా ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా, 100 శాతం డిజిటల్‌గా జరగాల్సిందే. ఈ కొత్త యాప్‌లో ఇంకా ఎన్నో సౌకర్యాలున్నాయి. మొబైల్ లేని ఇంటి పెద్దల ఆధార్‌ను కూడా లింక్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్‌డేట్ చేస్తే ఆటోమాటిక్‌గా అందరికీ కనిపిస్తుంది. ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్ అయినా, సిమ్ కార్డు తీసుకున్నా, హోటల్ రూమ్ బుక్ చేసినా .. ఒక్క స్కాన్ లేదా ఒక్క OTPతో పని అయిపోతుంది. ఈ మార్పు రాబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు కూడా పూర్తి అనుగుణంగా ఉంటుందని UIDAI అధికారులు తెలిపారు. మరో 18 నెలల్లో ఆ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే.. భారత్‌లో పర్సనల్ డేటా భద్రత కొత్త స్థాయికి చేరుకుంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే – ఇకపై ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ డేటా ఎవరి వద్దా ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.