జనవరి 2026 నుండి UPI లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి, అలాగే భద్రతను పెంచడానికి కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేశాయి.
జనవరి 2026 నుండి ప్రధాన మార్పులు..
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. సాధారణ వ్యక్తిగత లావాదేవీల (P2P) పరిమితిలో పెద్ద మార్పులు లేకపోయినా కొన్ని ప్రత్యేక కేటగిరీలలో లిమిట్స్ పెరగనున్నాయి.
1. పెరగనున్న లావాదేవీల పరిమితి (Transaction Limits)..
సాధారణంగా ఒక రోజుకు UPI పరిమితి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. అయితే 2026 నుండి ఈ లిమిట్ ను రూ. 2 లక్షల వరకూ పెంచే అవకాశం ఉంది. అలాగే కొన్నింటికి మినహాయింపులు లేదా పెంపు ఉండవచ్చు. ఆసుపత్రి బిల్లులు , విద్యా సంస్థల ఫీజుల కోసం పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ & ఇన్సూరెన్స్: ఐపీఓ (IPO) సబ్స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం కూడా లిమిట్ పెంచాలని పరిశీలిస్తున్నారు.
2. సెకండరీ వెరిఫికేషన్, భద్రత..
ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి, మొదటిసారి కొత్త వ్యక్తికి రూ. 2,000 కంటే ఎక్కువ పంపేటప్పుడు 4 గంటల టైమ్ విండో లేదా అదనపు వెరిఫికేషన్ ఉండవచ్చు. దీనివల్ల పొరపాటున వేరే అకౌంట్కు డబ్బులు పంపినా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది.పెద్ద మొత్తంలో చేసే పేమెంట్స్ కు అదనపు వెరిఫికేషన్ అవసరం అవ్వొచ్చు. అంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానే ఎక్కువమొత్తంలో చెల్లింపు చేయగలుగుతారు.
3. UPI Lite లిమిట్స్..
చిన్న చిన్న లావాదేవీల కోసం వాడే UPI Lite పరిమితిని కూడా పెంచే యోచనలో ఉన్నారు. పిన్ ఎంటర్ చేయకుండానే చేసే చెల్లింపుల పరిమితిని రూ. 500 నుండి రూ. 1,000 కి పెంచవచ్చు.
హై-వాల్యూ లావాదేవీలు: ఏ కేటగిరీకి ఎంత లిమిట్?
ఇకపోతే సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. వేర్వేరు కేటగిరీలకు వేర్వేరు పరిమితులు ఉన్నాయి.
- పెట్టుబడులు & ఇన్సూరెన్స్: స్టాక్ మార్కెట్ (Capital Markets), ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ రీపేమెంట్స్ (EMI, B2B Collections) కోసం ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ విభాగాల్లో రోజువారీ గరిష్ట పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుంది.
- క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెరిగింది. వీటి రోజువారీ గరిష్ట పరిమితి రూ. 6 లక్షలు.
- నగల కొనుగోళ్లు (Jewellery): బంగారం లేదా నగలు కొనుగోలు చేసేటప్పుడు ఒక్కో లావాదేవీకి గతంలో ఉన్న రూ. 1 లక్ష పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు. దీని రోజువారీ గరిష్ట పరిమితి రూ. 6 లక్షలుగా నిర్ణయించారు.
- విద్య , వైద్యం: పాఠశాలలు, కళాశాలల ఫీజులు , ఆసుపత్రి బిల్లుల కోసం ఒక్కో లావాదేవీకి , రోజువారీ గరిష్ట పరిమితి రూ. 5 లక్షలుగా స్థిరంగా కొనసాగుతుంది.
- సాధారణ లావాదేవీలు: వ్యక్తుల మధ్య జరిగే సాధారణ లావాదేవీల (P2P) పరిమితి యధావిధిగా రోజుకు రూ. 1 లక్ష మాత్రమే ఉంటుంది.
బ్యాంకులను బట్టి లిమిట్స్ మారొచ్చు!
ఇకపోతే NPCI గరిష్ట పరిమితిని నిర్ణయించినప్పటికీ.. మీ బ్యాంక్ (HDFC, SBI, ICICI మొదలైనవి) తన సొంత నిబంధనల ప్రకారం రోజువారీ పరిమితిని తగ్గించవచ్చు. కాబట్టి జనవరి 1 తర్వాత ఒకసారి మీ బ్యాంక్ యాప్లో ‘Transaction Limits’ చెక్ చేసుకోవడం ఉత్తమం. మొత్తానికి జనవరి 2026 నుండి UPI చెల్లింపుల్లో కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది.

































