కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇండియాటుడే- బిజినెస్‌టుడే నిర్వహించిన 2025 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా దీనిపై మాట్లాడారు.
‘‘పన్ను చెల్లింపుదారులందరూ కొత్త పన్ను విధానంలోకి మారాలని మీరు భావిస్తున్నారా?’’ అంటూ ఎదురైన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. కొత్తగా తీసుకురాబోయే ఆదాయపు పన్ను చట్టం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జీఎస్టీ రేట్లపై త్వరలో నిర్ణయం
జీఎస్టీ శ్లాబుల కుదింపు, రేట్ల తగ్గింపు ఓ కొలిక్కి వచ్చిందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై త్వరలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు అమలౌతున్నాయన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, రేట్ల సరళీకరణకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయ్యిందని, జీఎస్టీ కౌన్సిల్‌లో త్వరలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా రేట్లతో పాటు శ్లాబుల సంఖ్య కూడా తగ్గించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా కొట్టి పారేశారు. మూలధన వ్యయం తగ్గలేదని, రూ.11.21 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. జీడీపీలో దీని వాటా 4.3 శాతమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
































