ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పేరుతో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. మిగతా ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, సూపర్ డీలక్స్, ఏసీ బస్సుల్లో మాత్రం ఆ అవకాశం లేదు. పొరుగు రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా కు తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్లో సైతం ఈ పథకం వర్తించదు.
ఏపీవ్యాప్తంగా చాలా రూట్లో..
అయితే ఏపీవ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లు( Ghat roads ) ఉన్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన మార్గాలన్నీ ఘాట్ రోడ్లలోనే ఉన్నాయి. ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే భక్తులతో పాటు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. రోడ్డు భద్రత దృష్ట్యా అది ఏమంత క్షేమం కాదు. అందుకే ఘాట్ రోడ్లలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. ఉచిత పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసినప్పుడే ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రహదారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఘాట్ రోడ్లలో సామర్థ్యం, మోతాదుకు మించి ప్రయాణాలు చేయకూడదు. అది నిబంధనలకు విరుద్ధం కూడా. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రూట్లో అధికం..
తిరుమల- తిరుపతి దేవస్థానంలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి కూడా ఘాట్ రోడ్లు ఉన్నాయి. సాధారణంగా ప్రముఖ దేవస్థానాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఘాట్ రోడ్లను ఆశ్రయించాలి. ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతికి సప్తగిరి బస్సులు తిరుగుతుంటాయి. వీటిలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. అలాగే అన్నమయ్య రాయచోటి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఘాట్ రోడ్లు అధికం. ఆ రూట్లలో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. అయితే దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్టీసీ ప్రత్యేక నోటీస్ బోర్టులు కూడా పెడుతోంది. ప్రయాణికుల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో స్పష్టం చేసింది.
































