డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసిన యూపీఐలో (UPI payments) కీలక మార్పు రాబోతోంది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేయగలిగే కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ సాయంతో లావాదేవీలు చేసే సదుపాయానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 8న శ్రీకారం చుట్టనుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ కథనం వెలువరించింది. ముంబయిలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ వేదికగా దీన్ని ఆవిష్కరించనుందని తెలిపింది.
యూపీఐ చెల్లింపులకు పిన్‌తో పాటు ప్రత్యామ్నాయ విధానాలు కూడా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది. ప్రస్తుతం ఎంటర్ చేస్తున్న 4/6 అంకెల పిన్ స్థానంలో ఇతర ఆప్షన్లు కూడా ఉండాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ వివరాలతో పేమెంట్స్ చేసే సదుపాయం తీసుకురావంపై ఎన్‌పీసీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉడాయ్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ వివరాలను చెల్లింపుల కోసం వినియోగించుకోనుంది. దీనిపై ఎన్‌పీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ బయోమెట్రిక్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వస్తే పిన్‌కు ప్రత్యామ్నాయంగా మారడంతో పాటు డిజిటల్ పేమెంట్స్‌లో గణనీయమైన మార్పులు రానున్నాయి.
































