ఓటరు గుర్తింపు కార్డు లేదా ? 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటెయ్యొచ్చు..!

అమరావతి : ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటేస్తాం… ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి ఓటు వేయొచ్చు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం … ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డును అందజేస్తుంది. ఆ గుర్తింపు కార్డుతో ఓటు వేయాలి. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులు చూపి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.


1. పాస్‌పోర్టు 2. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు, 4. బ్యాంకులు జారీ చేసిన పాస్‌ పుస్తకం, తపాలా కార్యాలయాలు జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాలు, 5. పాన్‌కార్డు, 6. ఎన్‌పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, 7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, 8. కార్మిక మంత్రిత్వశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, 11. ఆధార్‌కార్డు చూపించి ఓటు వేయవచ్చు.