తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త.. బూచోళ్లు తిరుగుతున్నారు..! పిల్లల కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు

తల్లిదండ్రులారా ఇది హెచ్చరిక మీకు.. వేసవి సెలవులు కదా అని పిల్లల్ని ఆడుకోవడానికి ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..! బూచోల్లొస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకెళ్లి నిలువునా అమ్మేసే బూచోళ్లు తిరుగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


పిల్లలు లేని దంపతులే టార్గెట్‌గా కిడ్నాప్ ముఠాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. పేదలు, అమాయకుల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువునా అమ్మేస్తున్నాయి కిడ్నాప్ ముఠాలు. తాజాగా హైదరాబాద్ మేడిపల్లి కేంద్రంగా పిల్లలను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఢిల్లీ, పూణే నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తోంది ఓ కిలాడీ ముఠా. 3 నెలల పసికందుల నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయిస్తోందీ గ్యాంగ్. ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు.. 16 మంది చిన్నారులను కాపాడారు.

శోభారాణి, స్వప్న,షేక్ సలీం సహా 11 మంది నిందితులు పిల్లల విక్రయ రాకెట్‌లో భాగమైనట్టు పోలీసుల విచారణలో తేలింది. పీర్జాదిగూడలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అడ్డాగా ఆర్‌ఎంపీ శోభారాణి ఎప్పటి నుంచో ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలు లేనివారికి అక్రమంగా చిన్నారులను అమ్మేసి లక్షలకు దండుకుంటున్నారు. ఇప్పటివరకు 50 మందిని విక్రయించినట్టు విచారణలో తేలింది.

కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తుంటే.. కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం. పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు.

అయితే అక్రమంగా పిల్లలు కొన్నందుకు వాళ్ల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఎవరికైనా పిల్లలు లేకపోతే.. దత్తత తీసుకోవాలనిపిస్తే.. చట్టబద్ధంగా తీసుకోవాలి. అంతేగానీ ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు..