రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు.. ఇకపై అవి కనిపించవా?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జూన్ 2వ తేదీన అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన అన్నింటినీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్​లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా తీసుకురానున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణితో చర్చలు కూడా జరిపారు.


తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో చిట్​చాట్ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాచరికం ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం ఉండబోతోందన్నారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలని.. ఇక్కడ రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్​కు చెందిన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిప్సిపల్​కు రాజముద్ర రూపకల్పన బాధ్యతల్ని అప్పగించామని రేవంత్ పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంఎం కీరవాణి రూపొందిస్తున్నారనే వార్తలపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతల్ని ‘జయజయహే తెలంగాణ’ పాట రాసిన అందెశ్రీకే ఇచ్చామన్నారు. ఎవరితో మ్యూజిక్ కంపోజ్ చేయించాలనేది ఆయన నిర్ణయానికే వదిలేశామని స్పష్టం చేశారు. కీరవాణిని అందెశ్రీనే ఎంపిక చేశారని, అందులో తన పాత్ర లేదని వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు రేవంత్. విపక్షాలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎక్స్​పర్ట్స్ తేల్చినదే పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ వెన్నెముక విరిగిందన్న ముఖ్యమంత్రి.. ఈ విషయాన్ని తాను ముందే చెప్పినట్లు గుర్తుచేశారు.