దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు.
ఈ నేపథ్యంలో ఆయన కుమార్తెలైన త్రిష, సానిధి ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. (Parvesh Verma’s daughters) తండ్రి పర్వేష్ వర్మ చారిత్రాత్మక విజయంపై తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ‘మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే ఐదేళ్లకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. పార్టీ ఆయనకు అప్పగించిన పాత్రను మేం ఎల్లప్పుడూ అంగీకరించాం. ఈసారి కూడా మేం సంతోషంగా చేస్తాం’ అని సానిధి అన్నారు.
కాగా, పర్వేష్ వర్మ మరో కుమార్తె త్రిష కూడా ఢిల్లీ ఓట్లర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ పాలనను ఆమె విమర్శించారు. ‘ఢిల్లీ ప్రజలు ఇచ్చిన మద్దతుకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అబద్ధాలు చెప్పి పరిపాలించే వ్యక్తికి రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఢిల్లీ ప్రజలు ఎప్పటికీ పునరావృతం చేయరు. స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని అన్నారు.