Pawan Kalyan: చిరు కుటుంబంలో మెగా సంబరాలు

జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ విజయం సాధించి అమ్మ, అన్నలు, వదినల ఆశీస్సులు అందుకునేందుకు అక్కడికి చేరిన తరుణం.అక్కడ ఆత్మీయత ఉప్పొంగింది.. భావోద్వేగం ఎగసిపడింది.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అద్భుత విజయం సాధించడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఇది గురువారం సినీ హీరో చిరంజీవి కుటుంబమంతా ఒకేచోట చేరిన సందర్భంగా వినిపించిన ‘ఆనంద’భైరవి రాగం.


ఆశీర్వాద బలం: సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేస్తున్న పవన్‌ 

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన కుమారుడు అకిరా, భార్య అనాతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ కారు వరకు వచ్చి బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను, పిన్ని అనాను తోడ్కొని తీసుకువెళ్లారు. గుమ్మం దగ్గరకు చేరేసరికి వదిన సురేఖ హారతితో సిద్ధంగా ఉన్నారు. హారతిచ్చి… తోటికోడలు అనాను, కుమారుడు అకిరాను ఆలింగనం చేసుకున్నారు. ఇంతలో తల్లి అంజనాదేవి వచ్చి కుమారుడిని కౌగలించుకుని తన్మయం చెందారు. అక్కాచెల్లెళ్లు సైతం హారతులు ఇచ్చారు. కుటుంబసభ్యులంతా ఒక్కొక్కరే వచ్చి పవన్‌కల్యాణ్‌ను ఆలింగనం చేసుకుంటూ లోపలికి తీసుకువెళ్లారు. అన్న నాగబాబు, ఉపాసన, వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇలా ఒక్కొక్కరే పవన్‌కల్యాణ్, అనా దంపతులను అకిరాను అక్కున చేర్చుకుంటూ లోపలికి తీసుకువెళ్లారు.

మెగాపవర్‌  ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. తన ఇంటికి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్న చిరంజీవి


అమ్మకు.. అన్నకు పవన్‌ పాదాభివందనం

వన్‌కల్యాణ్‌ ఇంటి లోపలకి వెళ్తూనే తనకు ఎదురువచ్చిన తల్లి అంజనాదేవికి, అన్న చిరంజీవికి పాదాభివందనం చేశారు. చిరంజీవి ఒక పెద్ద దండను పవన్‌కల్యాణ్‌ మెడలో అంత ఎత్తు నుంచి ఎగురుతున్నట్లుగా ఎంతో సంతోషపడుతూ వేశారు. పవన్‌ భార్య అనాకు బొకే అందించారు. తర్వాత అంతా కలిసి కేకు కోశారు. ఈ సమయంలో మేనల్లుడు, సినీ హీరో సాయిధరమ్‌తేజ్‌ ఈల వేస్తూ సందడి చేశారు. అకిరా కూడా అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుణ్‌తేజ్‌ బాబాయ్‌ని అభినందిస్తూ నినాదాలు చేశారు. ఈ సన్నివేశం చూస్తూ పవన్‌ మరో అన్న, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కళ్ల వెంట ఆనందబాష్పాలు కురిశాయి. తర్వాత చిరంజీవి దంపతులు పవన్‌కల్యాణ్‌ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. ఆ తర్వాత వదిన సురేఖ వారిస్తున్నా వినకుండా పవన్‌కల్యాణ్‌ ఆమె కాళ్లకు నమస్కరించారు.

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌ 

పుత్రోత్సాహం జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ముద్దాడుతున్న తల్లి అంజనా దేవి

వదినమ్మ ఆత్మీయత  పవన్‌ను ఆత్మీయ ఆలింగనంతో అభినందిస్తున్న చిరంజీవి సతీమణి సురేఖ