Andhra news: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ రవిచంద్ర?

అమరావతి: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశముంది. సీఎం పేషీలో మరి కొందరు అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. మరో వైపు రాష్ట్రంలోని సలహాదారులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 4వ తేదీ నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.


మంత్రుల పేషీల్లోని పీఎస్‌లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 11లోగా ఆయా మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులు, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను సమర్పించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. అలాగే పేషీలకు సంబంధించి నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలని జీఏడీ తెలిపింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్ వివరాలను కూడా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.