ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే ప్రత్యేక బిరుదును అందుకున్నారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గీతా సారం, ధర్మతత్వం, తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఆత్మీయ అనుభవాల గురించి తెలిపారు. ఈ వేడుకకు తాను ఉప ముఖ్యమంత్రిగా కాకుండా.. ఆధ్యాత్మికతను అన్వేషించే సాధకుడిగా వచ్చానని స్పష్టం చేశారు. నాయకత్వం అంటే పదవులు కాదని.. ప్రజల కోసం తీసుకునే సత్ప్రయత్నాల సమాహారమని తెలిపారు.
ఎన్నికల ముందు అర్జునుడిలాంటి సందిగ్ధతను తానూ ఎదుర్కొన్నానని పవన్ గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత లాభనష్టాల కంటే రాష్ట్ర ప్రజల సమగ్ర మేలు ప్రధానమని భావించి పరిమితమైన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేశామని చెప్పారు. భగవద్గీత అనేది పూజా మందిరంలో అలంకరించుకునే గ్రంథం మాత్రమే కాదని, ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే సందేహాలు, సంఘర్షణలు, నిర్ణయాలకు పథనిర్దేశం చేసే ఆధ్యాత్మిక శక్తి అని పవన్ అభిప్రాయపడ్డారు. నేటి యువత ఎదుర్కొంటున్న సమాచార భారాలు, కెరీర్ ఒత్తిడులు, గుర్తింపు సంక్షోభం వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొనేందుకు గీత అందించే మానసిక బలం అత్యవసరమని తెలిపారు.
భారత భూమి ఎన్నో దౌర్జన్యాలను అధిగమించి నిలబడటానికి కారణం ఆయుధ శక్తి కాదని.. ధర్మాన్ని నిలబెట్టిన గ్రంథాలు, సాధువులు, సంప్రదాయాలు, పవిత్ర సంస్థలే అని ఆయన చెప్పారు. ఐన్‌స్టీన్, ఓపెన్‌హైమర్ వంటి మహామేధావులు గీత ద్వారా ప్రభావితులైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ఒకేచోట చేరడం ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ తత్వానికి జీవం పోస్తుందని.. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం ఆధ్యాత్మిక సంపదను కాపాడిందని, అలాంటి వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని.. భారత ఆధ్యాత్మిక ధారలో ఎంత ప్రధాన పాత్ర వహించాయో గుర్తుచేస్తూ, అలాంటి వారసత్వాన్ని కాపాడడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు.






























