ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. Such ఏడాది పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది.
అమరావతి రాజధాని పనులను పట్టాలెక్కించింది. దానికి నిధులను సమకూర్చుకోగలిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కూడా దృష్టి పెట్టింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి పెట్టింది. వీటన్నింటి పైన సానుకూలత ఒకవైపు ఉండగానే సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర.. ఇలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగలిగింది. అయితే తాజాగా మరో ఎన్నికల హామీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిపై ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసిపి ప్రశ్నకు సమాధానం..
శాసనసభ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైసీపీ ఎమ్మెల్సీ 50 ఏళ్ల పెన్షన్ కోసం అడిగారు. ఎస్సీ ఎస్టీలతోపాటు బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పారని.. అది ఏమైందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టిగానే బదులు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా పింఛన్ల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని.. త్వరలోనే 50 సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలు చేసే పనిలో ఉందని చెప్పుకొచ్చారు. దీంతో త్వరలో 50 ఏళ్ల పెన్షన్ పథకం కూడా అమలు కాబోతుందని అర్థమవుతోంది. ఎందుకంటే పింఛన్ల పెంపు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్క ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది.
ఎన్టీఆర్ తో ప్రారంభం..
పేదవాడికి పెన్షన్ అండగా ఉంటుందని భావించారు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ). నిరుపేదలకు పెన్షన్ ప్రకటించారు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని 500 రూపాయలకు పెంచారు. దీంతో పెన్షనర్లు కూడా ఎంతగానో ఆనందించారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. 500 రూపాయలు ఏ మూలకు చాలదని.. అందుకే పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే 2018లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడో ఎందుకు తానే పెంచుతానని చెప్పి వెంటనే పెన్షన్ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు నాలుగు నెలలు అమలు చేసి చూపించారు కూడా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 3000 రూపాయలకు పెంచుతానని మరోసారి ప్రకటన చేశారు. నవరత్నాల్లో పొందుపరిచారు.
మాట తప్పిన జగన్..
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మూడు వేల రూపాయలకు ఏకకాలంలో పింఛన్ మొత్తాన్ని పెంచలేదు. తాను అలా అనలేదని.. పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ ముందుకు పోతానని మాత్రమే చెప్పానని మాట మార్చారు. ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ నాలుగేళ్లలో 3000 రూపాయల పింఛన్ మొత్తానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాము అధికారంలోకి వస్తే 4 వేల రూపాయలకు పింఛన్ మొత్తం పెంచుతామని 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల బకాయి తో పాటు పెంచిన మొత్తాన్ని అందించగలిగారు. గత 15 నెలల కాలంలో అందిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు 50 ఏళ్లకే పింఛన్ పథకం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని తెలియడంతో అందరిలోనూ ఆశ నెలకొంది. చంద్రబాబు చెప్పారంటే తప్పకుండా అమలు చేస్తారని ఎక్కువమంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి 50 ఏళ్ల పింఛన్ పథకం పై ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు వస్తాయో చూడాలి.






























