Philadelphia plane crash: అమెరికాలో ఘోర దుర్ఘటన.. కూలిన మరో విమానం

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలో షాపింగ్‌మాల్ దగ్గర్లో ఓ చిన్న విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానం కూలింది.
ఈ ప్రమాదం వల్ల కొన్ని ఇళ్లు, కార్లూ ధ్వంసం అయ్యాయి.


ఇళ్లకు దగ్గర్లోనే విమానం కూలినట్లుగా.. సోషల్ మీడియాలో విజువల్స్‌ని బట్టీ అర్థమవుతోంది.

విమానం కూలిన తర్వాత.. భారీగా మంటలు చెలరేగాయి. అలాగే పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. రంగంలోకి దిగి.. మంటల్ని అదుపులోకి తెచ్చారు.

ఈ విమనంలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఇది షాపింగ్ మాల్ దగ్గర్లో కూలిపోవడం వల్ల, నేలపై ఉన్న ఎవరైనా చనిపోయారా అనేది తేలాల్సి ఉంది.

ఫిలడెల్ఫియా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఆఫీస్ ఈ ప్రమాదాన్ని నిర్ధారించింది. ఇది పెద్ద ప్రమాదంగా చెప్పింది. ఐతే.. మరిన్ని వివరాలు మాత్రం ఇంకా ఇవ్వలేదు.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మంటల్ని దాదాపు అదుపులోకి తెచ్చారు.

అమెరికాలో మొన్ననే ఒక విమాన ప్రమాదం జరిగింది. అంతలోనే మరొకటి జరగడం హాట్ టాపిక్ అయ్యింది.

బుధవారం అమెరికాలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లో ప్రయాణికుల విమానం, యూఎస్‌ ఆర్మీ హెలికాప్టర్ గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఎవరూ ప్రాణాలతో బతకలేదని అధికారులు తెలిపారు. ఢీకొన్న తర్వాత ఫ్లైట్‌, హెలికాప్టర్‌ పోటోమాక్ నదిలో పడిపోయాయి. మంచుతో నిండిన, ప్రమాదకర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే.. మరో విమానం కూలిపోవడం అందర్నీ షాక్‌లోకి నెట్టేసింది.