ఈ మేరకు భవిష్యత్తులో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు…ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎయిరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ టెక్నాలజీ వంటి రంగాలు రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ రంగాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే తొలి అడుగు
గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే తొలిసారిగా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం వెల్లడించారు. ఇది రాష్ట్రానికి మాత్రమే కాదు.. దేశానికి కూడా గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇలాంటి కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
యువతకు నైపుణ్యం.. ప్రభుత్వమే బాధ్యత
రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, కంపెనీలకు నైపుణ్యమున్న యువతను అందించడం ప్రభుత్వ బాధ్యతేనని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో ‘ఏపీ-ఫస్ట్’… ప్రతిష్టాత్మక కేంద్రం
ఈ అవసరాలన్నిటికీ పరిష్కారంగా తిరుపతిలో ‘ఏపీ-ఫస్ట్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల కలయికలో ఈ కేంద్రం ఏర్పడనుందని తెలిపారు. రాష్ట్ర యువతకు పూర్తి స్థాయిలో సహకరించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటామని చెప్పారు. యూనివర్సిటీలు, ప్రముఖ కంపెనీలతో ‘ఏపీ-ఫస్ట్’ సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులు చేస్తున్న కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యువతలో అవసరమైన నైపుణ్యాలు పెంచాలని తెలిపారు.
కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కరిక్యులమ్
ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలను గుర్తించి వాటిని విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ దిశగా విద్యా సంస్థలకు కరిక్యులమ్ తయారీలో ‘ఏపీ-ఫస్ట్’ కీలక పాత్ర పోషించాలన్నారు. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహించడం వల్లే తెలుగువాళ్లు ఆ రంగంలో అగ్రస్థానంలో నిలిచారని, ఫార్మా రంగంలో భవిష్యత్ ఉందని ముందుగానే గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలు దేశంలో టాప్‌లో ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. అదే తరహాలో రాబోయే భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
మూడేళ్లలో కీలక ఫలితాలు
యువత భవిత కోసం, స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ‘ఏపీ-ఫస్ట్’ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో కీలక పురోగతి కనిపించేలా ఈ వ్యవస్థ పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


































