అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఒక కరువు భత్యంతో ఉద్యోగులు శాంతించలేదు.
చర్చలు, కమిటీలతో కాలయాపన చేసి ఆఖరకు ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో కేంద్ర సంఘం భవనంలో జరిగింది. సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్‌తో సహా అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తమ సమస్యలపై కీలకంగా చర్చలు చేశారు. ప్రభుత్వ వైఖరితో తాము చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో, మంత్రివర్గ ఉప సంఘంతో, ఆఫీసర్స్ కమిటీలతో సుదీర్ఘంగా చర్చించి ప్రధానంగా పంచాయితీ కార్యదర్శులను గ్రేడుల విభజన, సచివాలయంలో 12.5 శాతం కోటా అమలు, పెండింగ్ మెడికల్ బిల్లుల మంజూరు, డీఏ మంజూరు, కొన్ని శాఖలకు అదునపు పోస్టుల మంజూరు వంటి 16 సమస్యలు పరిష్కరించినట్లు సమావేశంలో టీఎన్జీఓ వివరించింది.
1 జూలై 2023 నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ డిమాండ్ చేశారు. బకాయిపడిన మిగతా నాలుగు డీఏల మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సీపీస్ రద్దు, గచ్చిబౌలి ఇళ్లడ్ల స్థలాలను సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు, గచ్చిబౌలి టీఎన్జీవోస్ రెండో ఫేస్ భూమిని టీఎన్జీవో సొసైటీకు బదలాయింపు, హెల్త్ కార్డు విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించాలని టీఎన్జీఓ డిమాండ్ చేసింది.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీఎన్జీఓ నాయకులు డిమాండ్ చేశారు. టీఎన్జీఓ 80 సంవత్సరాల ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో త్వరలో లక్ష మంది ఉద్యోగులతో నిర్వహిస్తామని ప్రకటించారు. టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ పెండింగ్ సమస్యల సాధన కోసం పోరాటాలకు వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగుల అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్జీఓ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

































