Proffessor Kodanda Ram: తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం? – త్వరలోనే అధికారిక ప్రకటన!

www.mannamweb.com


Proffessor Kodanda Ram May be Telangana Education Minister: తెలంగాణ నూతన విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయనకు రేవంత్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఈ క్రమంలో త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలనే దానిపైనా సీఎం సూచనల మేరకు కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్లు సమాచారం.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం

కాగా, ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం (Kodanda Ram), అమరుల్లా ఖాన్ (Amarulla Khan)ల నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఈ ఎమ్మెల్సీల కోసం అంతకు ముందు పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీ, అలీ మస్కతి, జాఫర్ జావీద్, పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ రేసు నుంచి వైదొలిగారు. త్వరలోనే 54 కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియమించనుంది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల నాటికి నామినేటేడ్ పదవుల భర్తీతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో అనేక వర్గాలను, సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ జన సమితిని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ…మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా ఎంపిక చేసింది. కోదండరాంను మంత్రిని చేసి విద్యా శాఖను అప్పగిస్తే ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.