New Ration cards : కొత్త రేషన్‌ కార్డులు ఇంకెప్పుడు?

గొప్పలు చెప్పి.. చేతులెత్తేసిన గత వైసీపీ సర్కార్‌


కూటమి ప్రభుత్వంలోనూ తప్పని కాలయాపన

అదనపు ఆర్థిక భారం లేకుండా కొత్త కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ కసరత్తు

ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు

ఇంకా మాజీ సీఎం జగన్‌ బొమ్మతోనే పాత కార్డులు

కొత్త రేషన్‌కార్డుల కోసం రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అర్హులైన వారందరికీ కొత్త కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది. దీంతో జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. కొత్త కార్డుల కోసం 30,611, స్ల్పిట్‌ కార్డుల కోసం 46,918, కార్డుల్లో చేర్పులకు 2,13,007, అడ్రస్‌ మార్పునకు 8,263, తొలగింపునకు 36,588, కార్డులను సరెండర్‌ చేయడానికి 685 కలిపి మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై కసరత్తు చేస్తున్నామని, ప్రతిపాదించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పలుమార్లు ప్రకటించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులతోపాటు కొత్తగా పెళ్లిళ్లు అయిన జంటలు, గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో కార్డులు కోల్పోయిన వారు తమకు కొత్త రేషన్‌ కార్డులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఇక్కడి ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా మాజీ సీఎం జగన్‌, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోలతో ఉన్న పాత కార్డులపైనే రేషన్‌ సరుకులు ఇస్తుండటాన్ని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాటి స్థానంలో రీడిజైన్‌ చేసిన కొత్త కార్డులనైనా జారీ చేయాలని కోరుతున్నారు.

అదనపు ఆర్థిక భారం లేకుండా 1.5 లక్షల కొత్త కార్డులు జారీచేయొచ్చు..

కొత్త కార్డుల రూపకల్పనకు పలు డిజైన్లు పరిశీలించిన తర్వాత చివరకు లేత పసుపు రంగుతో రూపొందించిన కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. ఆర్థికంగా అదనపు భారం పడకుండానే కొత్త కార్డులను మంజూరు చేయవచ్చని నివేదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటిలో 90 లక్షల రేషన్‌ కార్డ్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించింది. మిగిలిన కార్డులకు ఇస్తున్న ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయొచ్చని నివేదికలో పేర్కొన్నారు. అదెలాగంటే.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మొత్తం రేషన్‌కార్డుల వినియోగంపై కాలానుగుణ సమీక్షలు చేసి.. ఆ సార్టింగ్‌ డేటా ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన (ఏఏవై), 1,36,420 పీహెచ్‌హెచ్‌ (ప్రయారిటీ హౌస్‌హోల్డ్‌) కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులను తొలగిస్తే ఏడాదికి రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. తాజాగా గత ఆరు నెలలుగా రేషన్‌ సరుకులు తీసుకోని కార్డులను కూడా తొలగించి.. వాటి స్థానంలో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని పౌరసరఫరాల అధికారులు ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండానే రాష్ట్రంలో 1.5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.