భారత ఆటోమొబైల్ రంగంలో ఎన్నో కార్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా (Hyundai Creta) సరిగ్గా ఇదే చేస్తోంది.
2025 సంవత్సరానికి సంబంధించి విడుదలైన సేల్స్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఎస్ యూవీ (SUV) సెగ్మెంట్లో రారాజుగా వెలుగొందుతున్న క్రెటా, ఈ ఏడాది ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మారుతి సుజుకి లాంటి దిగ్గజ కంపెనీలకు సైతం చెమటలు పట్టిస్తూ, మార్కెట్ వాటాను తనవైపు తిప్పుకుంది.
హ్యుందాయ్ ఇండియా అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2025 క్యాలెండర్ ఇయర్లో క్రెటా అమ్మకాలు అంచనాలను మించిపోయాయి. ఇంతకుముందు ఏ ఏడాదిలోనూ ఈ స్థాయిలో విక్రయాలు జరగలేదు. దీని లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజూ సగటున 548 క్రెటా కార్లు ఇండియన్ రోడ్ల మీదకు వస్తున్నాయి.
అంటే గంటకు సుమారు 23 కార్లు అమ్ముడవుతున్నాయన్నమాట. ఈ రేంజ్ పాపులారిటీ వల్లే మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో క్రెటాకు తిరుగులేకుండా పోయింది. మారుతి గ్రాండ్ విటారా వంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికీ, క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
క్రెటా విజయంలో దాని ఇంజన్ వైవిధ్యం కీలక పాత్ర పోషించింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా హ్యుందాయ్ ఇందులో మూడు రకాల ఇంజన్లను అందిస్తోంది. 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్ సిటీ డ్రైవింగ్ కి, ఫ్యామిలీతో ప్రయాణించే వారికి ఇది బెస్ట్. 1.5 లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ వేగాన్ని, పవర్ ను ఇష్టపడే కుర్రాళ్ల కోసం ఈ ఇంజన్ కేక పుట్టిస్తుంది.
1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, మైలేజీ కావాలనుకునే వారికి ఇది వరం. వీటికి తోడు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, IVT, 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండటంతో డ్రైవింగ్ అనుభవం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
క్రెటా అంటేనే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. ఇందులో ఉన్న ఫీచర్లు మరే ఇతర కార్లలో కనిపించవు. ముఖ్యంగా లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీ డ్రైవర్ కి ఎంతో రక్షణనిస్తుంది. దీంతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి స్టాండర్డుగా వస్తున్నాయి.
లోపల చూస్తే పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, బోస్ సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని ఒక పండుగలా మారుస్తాయి. ఇంతటి ఫీచర్లు ఉన్నప్పటికీ ధర విషయంలో హ్యుందాయ్ జాగ్రత్త పడింది. క్రెటా బేస్ వేరియంట్ ధర రూ.10.73 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ. 20.20 లక్షల వరకు ఉంది.
ఇంకా స్పోర్టీగా ఉండాలనుకునే వారి కోసం ఎన్-లైన్ (N-Line) మోడల్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.17.83 లక్షల నుంచి రూ. 20.09 లక్షల మధ్యలో ఉంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార్లకు క్రెటా సింహస్వప్నంలా మారింది.
మారుతి నెట్‌వర్క్ ఎంత పెద్దదైనా, హ్యుందాయ్ ఇస్తున్న ప్రీమియం ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ కస్టమర్లను క్రెటా వైపు లాగుతున్నాయి. 2026లో మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నా, క్రెటా తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

































