తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై రైల్వే శాఖ కీలక ఆదేశాలు.. ఇక రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఓటీపీ తప్పనిసరి

త్కాల్ టికెట్ బుకింగ్ విధానాన్ని ఏజెంట్లు, కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడం కోసం భారతీయ రైల్వేలు కొత్త విధానాన్ని తీసుకువచ్చాయి.


ఈ కొత్త విధానంలో ప్రయాణికులు తత్కాల్ టికెట్లు బుక్ చేసేటప్పుడు.. తప్పనిసరిగా మొబైల్ నంబర్‌ను అందించాలి. ఆ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతే టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థను నవంబర్ 17వ తేదీన కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనికి సానుకూల స్పందన రావడంతో.. త్వరలోనే దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని రైళ్లకు, అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

రైల్వే టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత, భద్రతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. తత్కాల్ బుకింగ్ సిస్టమ్ దుర్వినియోగం కాకుండా నిరోధించడంతోపాటు.. ఏజెంట్లు అధిక డిమాండ్ ఉన్న టిక్కెట్‌లను పెద్ద మొత్తంలో పొందకుండా అడ్డుకోవడం కోసం తీసుకువచ్చారు. ఓటీపీ ధృవీకరణ ద్వారా నిజమైన ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు.. తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వాలి. టికెట్ నిర్ధారణకు ముందే ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ధృవీకరించడం తప్పనిసరి చేయనున్నారు. నవంబర్ 17వ తేదీన ఎంపిక చేసిన రైళ్లకు.. ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఇప్పటికే 52 రైళ్లకు విస్తరించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని రైళ్లకు, అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు.

ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్‌లకు దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను రైల్వే మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి.. బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాల వరకు.. ఆధార్ ద్వారా ధృవీకరించబడిన వినియోగదారులకు మాత్రమే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో రిజర్వ్ చేసిన సాధారణ టికెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.