ఈ నెల 13న అల్పపీడనం… ఏపీలో వానలే వానలు… ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం (ఆగస్టు 13) నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉణ్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇదిలాఉంటే, దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో (ఆగస్టు 11,12) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధ,గురువారల్లో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక, ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున రాయలసీమలోని పలుచోట్ల, కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అయితే నేటి నుంచి కోస్తాంధ్రలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ వాయువ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 12న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 13న గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆగస్టు 14న ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఇక, ఈ నెల 13న ఏర్పడనున్న అల్పపీడనం తర్వాత ఇదే నెల మూడో వారంలో మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.