RBI: వసూలు చేసిన వడ్డీ కస్టమర్లకు తిరిగి ఇవ్వాల్సిందే.. బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక!

అధిక వడ్డీలు వసూలు చేస్తూ కస్టమర్లను బ్యాంకులు మోసం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. సోమవారం ఈ మేరకు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్ కంపెనీల(NBFC)కు ఆదేశాలు జారీ చేసింది.


లోన్‌లపై అధిక వడ్డీని వసూలు చేసిన సందర్భాలను ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో కస్టమర్‌ల నుంచి వసూలు చేసే వడ్డీలు న్యాయంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని, తమ విధానాలను వెంటనే సమీక్షించాలని ఆర్థిక సంస్థలను ఆదేశించింది.

2023 మార్చి 31తో ముగిసే కాలానికి సంబంధించి బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆన్‌సైట్ పరిశీలనలో, వడ్డీని వసూలు చేయడంలో ఆర్థిక సంస్థలు అన్యాయమైన పద్ధతులను ఉపయోగిస్తున్న సందర్భాలను కనుగొన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ తన సర్క్యులర్‌లో.. న్యాయబద్ధత, పారదర్శకత దృష్ట్యా, అన్ని నియంత్రిత సంస్థలు(బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటివి) రుణాల పంపిణీ విధానం, వడ్డీ వర్తింపు, ఇతర ఛార్జీల గురించి తమ పద్ధతులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. అవసరమైన విధంగా సిస్టమ్ లెవల్‌ మార్పులు సహా దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది.

* ఆర్‌బీఐ గమనించిన కొన్ని అన్యాయమైన పద్ధతులు

– కొన్ని సందర్భాల్లో, బ్యాంకులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోన్‌ పేమెంట్‌లను షెడ్యూల్ కంటే ముందే తీసుకుంటున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. అయితే మొత్తం లోన్‌ అమౌంట్‌ ఆధారంగా వడ్డీని కాలిక్యులేట్‌ చేస్తున్నాయి.

– లోన్‌ డిస్‌బర్సల్‌ లేదా రీపేమెంట్‌ విషయంలో, కొన్ని బ్యాంకులు రుణం బకాయి ఉన్న కాలానికి మాత్రమే వడ్డీని వసూలు చేయకుండా, నెల మొత్తానికి వడ్డీని వసూలు చేస్తున్నాయి.

– లోన్‌ అప్రూవ్‌ చేసిన తేదీ నుంచి లేదా లోన్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తేదీ నుంచి వడ్డీని వసూలు చేయడం. వాస్తవానికి కస్టమర్‌కు ఫండ్స్‌ ఇచ్చిన తేదీ నుంచి వడ్డీని లెక్కించాలి. అలాగే, చెక్కు ద్వారా ఇచ్చిన లోన్‌ల విషయంలో, కస్టమర్ చాలా రోజుల తర్వాత చెక్కును స్వీకరించినప్పటికీ, కొన్నిసార్లు చెక్కు తేదీ నుంచి వడ్డీని వసూలు చేస్తున్నారు.

* వసూలు చేసిన వడ్డీ తిరిగి ఇవ్వాల్సిందే

కస్టమర్‌లతో వ్యవహరించేటప్పుడు న్యాయబద్ధత, పారదర్శకత స్ఫూర్తికి అనుగుణంగా లేని వడ్డీని వసూలు చేసే నాన్‌ స్టాండర్డ్‌ ప్రాక్టీస్‌లు తీవ్రమైన ఆందోళనకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. ఇటువంటి పద్ధతులు ఎక్కడ వెలుగులోకి వచ్చినా, బ్యాంకులు, NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అదనపు వడ్డీని కస్టమర్లకు చెల్లించేలా RBI పర్యవేక్షక బృందాలు చర్యలు తీసుకుంటాయి. ఇతర ఛార్జీలను కస్టమర్‌లకు రీఫండ్‌ చేసేలా చూస్తాయన సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. రుణాలు ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో చెక్కులను జారీ చేయడానికి బదులుగా ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లను ఉపయోగించమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణదాతలను ప్రోత్సహిస్తోంది.