IPL 2024: చెన్నై కొంపముంచిన శివమ్ దూబే.. సంచలన విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ!

ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్‌రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్‌ ప్రపంచం తీర్మానించింది. ఆర్సీబీ నిస్సహాయతను, వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోటెత్తాయి. ఆఖరికి ఆ జట్టు ఆటగాడు కూడా కలలో సైతం తమ జట్టు ముందంజ వేస్తుందని ఊహించి ఉండడు. కానీ అద్భుతం!


బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో, అంటే వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కనీ వినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ.. మెరుగైన రన్‌రేట్‌తో ముందంజ వేసింది.

బెంగళూరు: కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో రచిన్‌ రవీంద్ర (61: 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగగా, జడేజా (42*: 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజింక్య రహానె (33: 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోనీ (25: 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌ రెండు వికెట్లు తీయగా, మాక్స్‌వెల్‌, సిరాజ్‌, ఫెర్గూసన్‌, కామెరూన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అర్ధశతకం చేసిన డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ వచ్చింది. ఈ మ్యాచ్‌తో కలిపి వరుసగా ఆరు విజయాలు సాధించిన బెంగళూరు ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

చివరి వరకు ఉత్కంఠే..
219 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన చెన్నైకి తొలి బంతికే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను మాక్స్‌వెల్‌ ఔట్‌ చేశాడు. షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో బంతిని ఆడగా యశ్‌ దయాల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మూడో ఓవర్లో మిచెల్‌ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రహానెతో కలసి రచిన్‌ రవీంద్ర ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై 58 పరుగులతో నిలిచింది. 10వ ఓవర్‌ తొలి బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో రహానె ఔటయ్యాడు. 10 ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు 87 పరుగులతో నిలిచింది. అయితే 12 ఓవర్‌ వేసిన ఫెర్గూసన్‌కి రచిన్‌ చుక్కలు చూపించాడు. సిక్స్‌తో అర్ధశతకం బాదిన అతడు తర్వాతి బంతిని సైతం స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే 13వ ఓవర్‌లో రెండో పరుగు తీసే క్రమంలో రచిన్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత దూబెను గ్రీన్‌ పెవిలియన్‌ పంపించాడు. ఇక సిరాజ్‌ వేసిన బంతికి డుప్లెసిస్‌ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో శాంట్నర్‌ వెనుదిరిగాడు. 15 ఓవర్లలో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులతో నిలిచింది.

దీంతో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చెన్నై 18 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినా నెట్‌రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌ చేరుకునేందుకు అవకాశం ఉండడంతో రెండు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. క్రీజులో ఉన్న జడేజా, ధోనీ ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదుతుండడంతో బెంగళూరు శిబిరంలో ఉత్కంఠ పెరిగింది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు కావాలి. 19వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 35 పరుగులు కావాలి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే 6 బంతుల్లో 17 పరుగులు చేస్తే చాలు. ఈ ఓవర్‌లో యశ్‌ దయాల్‌ మాయ చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్‌ కొట్టగా, రెండో బంతికి స్వప్నిల్‌ సింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ధోనీ ఔటయ్యాడు. దీంతో ఇరుజట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. స్ట్రైకింగ్‌లోకి శార్దూల్‌ ఠాకూర్‌ రాగా, మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి సింగిల్‌ వచ్చింది. సమీకరణం చివరి రెండు బంతులకు 10 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్‌లో జడేజా ఉండడంతో అతడేమైనా మాయ చేస్తాడా అని చెన్నై అభిమానులు ఆశించారు. అయితే చివరి రెండు బంతులకు యశ్‌ దయాల్‌ పరుగులేమీ ఇవ్వకపోవడంతో బెంగళూరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరి ఓవర్‌లో దయాల్‌ కేవలం 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసి బెంగళూరు హీరోగా మారిపోయాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (54: 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (47: 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పటీదార్‌ (41: 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్‌ గ్రీన్‌ (38: 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీయగా, తుశార్‌ దేశ్‌పాండే, శాంటర్న్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌, పంజాబ్‌ ఒక్కొక్క మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తన తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయినా మొదటి స్థానంలోనే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ రెండో స్థానానికి చేరుకోవాలంటే పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో నెగ్గాల్సి ఉంటుంది.