పేదలందరికీ భారీగా డబ్బు .. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన

మీరు గమనించే ఉంటారు.. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందాలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తూ.. చాలా చోట్ల అక్రమ మనీ, నగలు, ఆస్తుల వంటి వాటిని స్వాధీనం చేసుకుంటోంది.


ఇవన్నీ అక్రమం కాబట్టే.. స్వాధీనం చేసుకుంటున్నారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ భారీ మొత్తాలన్నీ తిరిగి పేదలకే దక్కాలన్నది తన భావన అని అన్నారు. ఈ విషయానికి సంబంధించి తన మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయన్న మోదీ.. దోపిడీ అయిన పేదల సొమ్మును తిరిగి పేదలకే ఎలా ఇవ్వాలన్న అంశాన్ని లోతుగా ఆలోచిస్తున్నారు.

పేదలకు తిరిగి మనీ ఇచ్చే విషయంలో ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై న్యాయసలహా కోరామనీ, నిపుణులతోనూ లోతుగా చర్చిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌రు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈడీ స్వాధీనం చేసుకున్న వేల కోట్లను ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆన్సర్ ఇచ్చారు. న్యాయ నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం.. అవసరమైతే.. చట్టపరమైన మార్పులు కూడా చేస్తామని మోదీ అన్నారు.

కాంగ్రెస్ హయాంలో సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలు ప్రభావవంతంగా పనిచెయ్యలేదన్న ప్రధాని మోదీ.. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దాదాపు రూ.1.25 లక్షల కోట్లను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఎక్కువ కేసుల్లో ఆర్థికంగా నష్టపోతున్నది పేదలే అన్న ఆయన, పేదలకు దక్కాల్సిన ప్రయోజనాలను అక్రమార్కులు, అవినీతిపరులూ దోచుకుంటున్నారని మోదీ అన్నారు. అవినీతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

జరుగుతుందా?

ఇదివరకు నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తెప్పిస్తాననీ, దాన్ని పేదలకు ఇస్తానని ప్రధాని మోదీ అన్నారు. ఈ కారణంగానే దేశంలో కోట్ల మంది జన్ ధన్ బ్యాంక్ అకౌంట్‌లను తెరిచారు. కానీ వాటిలో కేంద్రం రూపాయి కూడా వెయ్యలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. మోదీ పేదలకు మనీ అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. తద్వారా పేదలకు మనీ ఇవ్వాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ఎప్పటికి ఆచరణలోకి వస్తుంది అనేది ప్రశ్నగానే ఉంది. కేంద్రం తలచుకుంటే ఈ క్షణమే అమలు చెయ్యవచ్చు కూడా. కానీ కేంద్రం.. న్యాయపరమైన సమస్యలు రాకుండా, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.