Interesting Facts: ట్యాబ్లెట్ షీట్‌పై ఈ రెడ్ లైన్ అర్థం ఏంటంటే..

మందులు కొనేందుకు వెళ్లినప్పుడు కొన్నింటిపై నిలువుగా ఒక ఎరుపు గీత కనపడుతుంది. ఈ రెడ్ లైన్ ఎందుకో మీరెప్పుడైనా గమనించారా.. దీని వెనుక ఓ ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కొన్ని రకాల ట్యాబ్లెట్ షీట్లు, బాటిల్స్ పై ఈ ఎరుపు గీతను మనం చూడొచ్చు. దీని అసలు అర్థం ఏంటంటే.. ఏ మందుల మీదైతే ఈ లైన్ ఉంటుందో అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం ప్రమాదకరమని అర్థం. అంటే, మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్‌ను ఫార్మసిస్ట్‌కు ఇస్తేనే, వారు మనకు ఆ మందు ఇస్తారు… ఎందుకంటే సాధారణ అనాసిన్ పారాసెటమాల్ వంటి కొన్ని మాత్రలలో ఈ ఎరుపు గీత ఉండదు, అందుకే మనం వాటిని ఫార్మసీలలో సులభంగా పొందొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఎర్రటి లైన్ కలిగిన మాత్రలను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం.


ఈ కోడ్ అర్థం తెలుసా..
ఈ ఎరుపు గీతను దాటి వెళ్తే అందులో కొన్ని సింబల్స్ కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆర్ ఎక్స్ అని రాసి ఉంటుంది. ఇవి వైద్యుని సిఫార్సు స్థితిని సూచిస్తాయి…. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్‌ఎక్స్ కోడ్ అర్థం ఏంటంటే.. ఒకసారి డాక్టర్ ఫలానా మందును ప్రిస్క్రిప్షన్ రూపంలో రాసిస్తే.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాటిని కొనాల్సి వచ్చినప్పుడు మనకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు. మామూలుగానే మనం వాటిని తీసుకోవచ్చు అన్నమాట. అలాగే వన్ టైం యూజ్ కోసం మాత్రమే రాసే మందులు కొన్ని ఉంటాయి.

ఈ ప్రిస్క్రిప్షన్ గడువు 6 నెలలే..
కొన్నింటిపై ఎన్‌ఆర్‌ఎక్స్ అనే కోడ్ కనపడుతుంది. దీనినే న్యూ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఈ రకం మందులు స్వల్పంగా ఉత్తేజపరిచేవిగా ఉంటాయి. ఈ మందులను నార్కోటిక్స్ డ్రగ్స్ అంటారు. ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లో అమ్మరు. ఈ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకు ఇవ్వబడవు… ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ 6 నెలలు మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ గడువు ముగుస్తుంది. దీని అర్థం 6 నెలల తర్వాత ఫార్మసీలలో వైద్యుడు సూచించిన ఈ ఎన్‌ఆర్‌ఎక్స్ రకం మందులను మనం పొందలేము. వైద్యులు సాధారణంగా డిప్రెషన్, సైకోసిస్, నిద్రలేమి వంటి వ్యాధులకు ఈ రకం మందులను సూచిస్తారు.

డేంజరస్ మందులు ఇవే..
ఈ మందుల్లోనే మరో రకం ఎక్స్ఆర్‌ఎక్స్.. ఈ మందులను సాధారణంగా అధిక ఉద్దీపన మందులుగా సూచిస్తారు. ఈ రకమైన మందులను నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ పదార్థ ఆధారిత మందులు అంటారు. ఈ ఔషధాలన్నీ ఎక్స్ అక్షరంతో వర్గీకరించబడతాయి. ఈ ఔషధాలన్నీ చాలా బలమైన నొప్పి నివారణ మందులు, మత్తుమందులుగా ఉపయోగించబడతాయి. ఈ రకం మందులను సాధారణంగా క్యాన్సర్ రోగులు, మానసిక రోగులు మరియు ప్రధాన శస్త్రచికిత్సలకు ఉపయోగిస్తారు. అందరు వైద్యులు ఈ మందులను సూచించరు. ముఖ్యంగా, మానసిక వైద్యులు, అనస్థీషియాలజిస్టులు మరియు ఆంకాలజిస్టులు ఎక్కువగా సిఫార్సులు చేసే వారు. ఈ ఎక్స్ఆర్‌ఎక్స్ రకం ప్రిస్క్రిప్షన్‌ను సూచించిన రోజున ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు. ఫార్మసిస్ట్‌లు రోగి సమాచారంతో పాటు ఈ ప్రిస్క్రిప్షన్‌ను 2 సంవత్సరాల పాటు భద్రపరచుకోవాలి. ఎన్‌ఆర్‌ఎక్స్, ఎక్స్ఆర్‌ఎక్స్ మందులు ఇంతగా పరిమితం చేయబడటానికి కారణం.. కొంతమంది ఈ మందులను మాదకద్రవ్యాలుగా దుర్వినియోగం చేస్తుంటారు. వైద్యులు ఈ రకమైన మందులను రోగుల నుండి ఒకేసారి ఆపరు. వారు వాటిని క్రమంగా ఆపుతారు. ఈ మందులను ఒకేసారి ఆపడం వల్ల రోగులలో దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే ఇవి డేంజరస్ గా పరిగణిస్తారు.