ఫుల్ పేమెంట్ కడితేనే రెన్యువల్.. బ్యాంకర్లు ప్రత్యేక కండీషన్

 ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడంతో చేసేదేమీ లేక చేతిలో చిల్లిగవ్వలేక, బయట వడ్డీకి అప్పులు పుట్టక, పంట పెట్టుబడుల కోసం విలువైన బంగారు ఆభరణాలను తీసుకెళ్లి బ్యాంకులలో తనఖా పెడుతున్నారు.


తద్వారా వచ్చే డబ్బులతో పంటల సాగు ఖర్చు చేస్తుండగా.. మిగిలిన కొంత డబ్బులు చేతి ఖర్చుల కోసం ఎమర్జెన్సీలో పెట్టుకుంటున్నారు. బంగారం ధర పెరిగినా కొద్ది డబ్బు అవసరాలు పెరుగుతుండడంతో చాలామంది రైతులు సమీపంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బ్యాంకర్లు ఈమధ్య కొత్తగా తీసుకున్న రుణాలను వాయిదా దాటిన తర్వాత రెన్యువల్ చేయాలంటే ఫుల్ పేమెంట్ కట్టాలని 2025 ఫిబ్రవరి నెల నుంచి కండీషన్ పెట్టడం రుణ గ్రహీతలను ఆందోళన గురిచేస్తోంది. చేతిలో డబ్బులు లేకనే లోన్ తీసుకుంటే, ఫుల్ పేమెంట్ కడితేనే రెన్యువల్ చేస్తుండడంతో, అనేక మంది రైతులు ఫుల్ పేమెంట్ కట్టేందుకు చేతిలో డబ్బులు లేక, ఫైన్ లు బాగా పడతాయన్న భయంతో వడ్డీ వ్యాపారులను మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అవకాశంగా భావించి వడ్డీ వ్యాపారులు నాలుగు ఐదు గంటల కోసం వడ్డీకి ఇస్తుండడంతో గోల్డ్ రెన్యువల్ దారులు బ్యాంకులో డిపాజిట్ చేసి మళ్లీ కొత్తగా రుణం పొందుతున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చిన డబ్బులకు 1000 నుంచి 2000 రూపాయల వరకు అదనంగా భారం పడడం, రెన్యువల్ చేయడానికి అక్కడో ఐదారు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతుండడం వలన గోల్డ్ లోన్ దారులైన రైతులు లబోదిబోమంటున్నారు.

క్యాష్ లేకనే..

తమ వద్ద అంత పెద్ద మొత్తంలో క్యాష్ లేకనే లోన్ తీసుకుంటున్నామని, ఈ విషయాన్ని బ్యాంకర్లు ఎందుకు గ్రహించడం లేదని రైతుల కొందరు ఆక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు. లక్షల రూపాయల క్యాష్ సిలక్ ఉన్నట్లయితే గోల్డ్ లోన్ ఎందుకు తీసుకుంటామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర లక్షా నలభై వేల రూపాయలకు పైగా తులం పలుకుతుండగా, లోన్ తీసుకుంటే బ్యాంకు నుంచి బంగారు ఆభరణాలకు85 శాతం మాత్రమే డబ్బులు లెక్క కట్టి చెల్లిస్తున్నారు. మిగతా అమౌంట్ కు సంబంధించి బంగారు ఆభరణాలు బ్యాంకర్ల వద్ద ఉండగా, ఫుల్ పేమెంట్ కడితేనే లోన్ రెన్యువల్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని రైతులు కొందరు వాదిస్తున్నారు. ఈ విధంగా కండిషన్ పెట్టడం వలన బ్యాంకుల వద్ద కొందరు మధ్య దళారుల అవతారం ఎత్తి బ్యాంకులలో పనిచేసే కొందరు సిబ్బందితో కమిట్మెంట్అయి దళారీ బిజినెస్ కు తెర లేపారన్న ప్రచారం జరుగుతోంది.

వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకే

తక్కువ వడ్డీ పడుతుందన్న ఉద్దేశంతో వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిందని తెలుస్తుంది. ఒక్కో వడ్డీ వ్యాపారి అమాయకులైన ప్రజల నుంచి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని, వారి అవసరాలను బట్టి రెండున్నర నుంచి మూడు రూపాయలకు పైగా వడ్డీకి ఇస్తూ పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకులలో కుదవ పెట్టి వచ్చిన డబ్బులను మళ్లీ మిత్తికి ఇస్తున్నారు. దీంతో బ్యాంకులలో గోల్డ్ లోన్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో, పోయిన సంవత్సరం నుంచి కొత్త నిబంధన లను అర్బీ ఐ అమల్లోకి తేవడం మధ్య పేద తరగతి వారికి భారంగా పరిణమించింది. వారిని కట్టడి చేయడం ఏమో కాని, గోల్డ్ లోన్ తీసుకున్నందుకు మొత్తం అమౌంట్ కట్టలేక నానా హైరానాకు గురవుతున్నారు.

ధర్నాకు సిద్ధమవుతున్నరైతులు..?

ఇంట్రెస్ట్ కడితే గోల్డ్ రుణాలు రెన్యువల్ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరుతూ రైతుల కొందరు బ్యాంకుల ముందు ఆందోళన సిద్ధమవుతున్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే.. ఒకేసారి మొత్తం పేమెంట్ కట్టించుకొని రెన్యువల్ చేయించుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేయాలని బాధిత రైతులు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత పద్ధతినే గోల్డ్ లోన్ రుణాలను రెన్యువల్ చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు బ్యాంకులు ఏమంటాయో వేచి చూడాలి మరీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.