రైల్వేలో రాయితీల పునరుద్దరణ, వీరికే వర్తింపు – మార్గదర్శకాలు

రైల్వేలో ప్రస్తుతం రాయితీలు ఎవరికి అమలు అవుతున్నాయి. చాలా మందిలో ఈ సందేహం కనిపిస్తోంది. కరోనా సమయంలో రైల్వే శాఖ అప్పటి వరకు అమలు చేస్తున్న రాయితీలను రద్దు చేసింది.


కరోనా తరువాత యధాతథంగా తిరిగి అమలు చేస్తారని అందరూ భావించారు. అందులో ప్రధానంగా సీనియర్ సిటిజెన్స్ కు ఇచ్చే రాయితీ పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, రైల్వే కొన్ని రాయితీలను మాత్రం కొద్ది పాటు మార్పులతో కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

రైల్వేలో విద్యార్థులకు ప్రయాణ రాయితీలను ఇస్తున్నారు. కొవిడ్​ సమయంలో ఈ రాయితీలను తొలగించారు. అయితే విద్యార్థులకు గతంలో కొనసాగిస్తున్న రాయితీని మళ్లీ పునరుద్ధరించారు. ఈ రాయితీలు అందించే అంశాలో మార్గదర్శకాలను రైల్వే అధికారులు వెల్లడించారు. విద్యార్ధులు వారు చదువుతున్న గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాల నుంచి పొందిన పత్రంతో డీఆర్‌ఎం కార్యాలయంలో సీనియర్‌ డీసీఎం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ వారు సూచించిన మేరకు విద్యార్థులు కొన్ని పత్రాలను ఇవ్వాలి. అనంతరం రైల్వే అధికా రులు వాటిపై సంతకాన్ని చేస్తారు. ఆ తర్వాత రాయితీ పుస్తకాన్ని సంబంధిత యాజమాన్యానికి ఇస్తారు. ఆ విషయాన్ని స్థానిక రైల్వేస్టేషన్లలో తెలియజేయాల్సి ఉంటుంది. ఆపై ప్రిన్సిపల్‌ నుంచి లెటర్‌ తీసుకోవాలి. విద్యార్థులు ఆఫ్‌లైన్‌లో రైళ్లలో సైతం టిక్కెట్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

అయితే, రైళ్లో ప్రయాణించే సాధారణ విద్యార్థులకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం రాయితీని ఇస్తున్నారు. ఆన్​లైన్​లో టిక్కెట్లు బుక్​ చేసుకునే వారికి మాత్రం ఈ ప్రయాణ రాయితీ లభించదు. కేవలం ఆఫ్‌లైన్‌లోనే టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికే ప్రయాణించేందుకు రాయితీని ఇస్తున్నారు.

ఆ సమయంలో రైల్వే సిబ్బందికి అవసరమైన పత్రాలు సమర్పించాలి. రాయితీలు ఏసీ తరగతులకు లభించదు. జనరల్, స్లీపర్‌ క్లాసులకు సంబంధించిన రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి. కోవిడ్ కు ముందు వరకు దివ్యాంగులు, విద్యార్థులు, క్రీడాకారులు, సీనియర్​ సిటీజన్లు, జర్నలిస్టులకు, అలాగే గుండె శస్త్రచికిత్సలు, తలసేమియా, కాన్సర్​, కిడ్నీ రోగులకు రైల్వేశాఖ రాయితీలు అందించేది. కరోనాతో ఆపేసిన రాయితీల్లో విద్యార్ధుల వరకు పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.