బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీ సేవలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో రోబోటిక్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.


రోగులకు మరింత కచ్చితత్వంతో కూడిన చికిత్స అందించేందుకు.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.5.4కోట్ల వ్యయంతో అత్యాధునిక రోబోటిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎయిమ్స్‌ బీబీనగర్‌ డైరెక్టర్‌ అమిత అగర్వాల్‌, ఐవోసీ డైరెక్టర్లు బిభూతి ప్రధాన్‌, పీయూష్‌ మిట్టల్‌లతో కలిసి ‘ఆటోమేటెడ్‌ రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌’ పాటు ‘హై పెడిలిటీ అడల్ట్‌ పేషెంట్‌ సిమ్యులేటర్‌’ను ప్రారంభించారు. మోకాళ్ల మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో ఈ రోబోటిక్‌ సర్జరీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ విధానంలో రక్తస్రావం, నొప్పి తక్కువగా ఉండి రోగులు త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రోబోటిక్‌ సర్జరీతో పాటు అందుబాటులోకి వచ్చిన ‘క్రిటికల్‌ కేర్‌ సిమ్యులేటర్‌’ వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌ సిబ్బందికి ఎంతో ఉపయోగకరమని,అత్యవసర సమయాల్లో మనిషి ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రయోగాత్మకంగా నేర్చుకోవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అమిత అగర్వాల్‌ అన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చులో నాలుగో వంతు ధరకే ఏయిమ్స్‌లో ఈ సేవలు అందించనున్నట్లు స్పష్ట్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.