రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం

 మైదానంలో పరుగుల వరద పారించే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది.

తాజాగా ప్రకటించిన ఈ పద్మ పురస్కారాల్లో రోహిత్ శర్మను, భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పద్మశ్రీ వరించింది. మాజీ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్‌కు పద్మ భూషణ్ అవార్డును లభించింది. ఈ సంవత్సరం పద్మశ్రీ గ్రహీతలలో పారిస్ పారాలింపిక్స్ 2024 బంగారు పతక విజేత పారా-అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత మహిళా హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పునియా, కోచ్‌లు బల్దేవ్ సింగ్, భగవాన్‌దాస్ రైక్వార్, దేశంలో మహిళా హాకీలో విప్లవాత్మక మార్పులు చేసిన కె. పళనివేల్ కూడా ఉన్నారు.


దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు. వీటిని మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఈ అవార్డులను కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాలలోప్రదానం చేస్తారు. ‘పద్మ విభూషణ్’ అసాధారణమైన, విశిష్ట సేవకు, ‘పద్మ భూషణ్’ ఉన్నత స్థాయి విశిష్ట సేవకు, ‘పద్మ శ్రీ’ ఏ రంగంలోనైనా విశిష్ట సేవకు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది.

విజయ్ అమృత్‌రాజ్‌:టెన్నిస్‌లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఆటగాడిగా విజయ్ అమృతరాజ్ ప్రసిద్ధి చెందారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన విజయ్ అమృతరాజ్ వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఈ సంవత్సరం పద్మభూషణ్ అందుకున్న ఏకైక క్రీడాకారుడు ఆయన. మాజీ టెన్నిస్ స్టార్‌ను గతంలో 1983లో పద్మశ్రీ, 1974లో అర్జున అవార్డుతో సత్కరించారు.

8 మంది క్రీడాకారులకు పద్మశ్రీ అవార్డులు..
హర్మన్‌ప్రీత్ కౌర్: భారత మహిళా జట్టు గత సంవత్సరం తొలిసారిగా ICC ODI ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు తన తొలి ICC ట్రోఫీని సాధించింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో, జట్టు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చి టైటిల్‌ను ముద్దాడింది.

రోహిత్ శర్మ: రోహిత్ శర్మ నాయకత్వంలో భారత పురుషుల జట్టు 2024లో T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.