Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం

Rohit Sharma:ముంబై ఇండియన్స్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ శుక్రవారం నాడు ఆడింది. లక్నో సూపర్ జెయింట్‌తో తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఈ మ్యాచ్ ఆడింది.


ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. అయితే రోహిత శర్మ మ్యాచ్‌కు ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. కాగా దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కెమెరామెన్‌లు ప్రతిదాన్ని రికార్డ్ చేశారని రోహిత్ తన పోస్ట్‌లో ఫిర్యాదు చేశాడు. “క్రికెటర్ల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. మ్యాచ్ రోజున, శిక్షణ సమయంలో స్నేహితులు మరియు సహచరులతో గోప్యతతో మాట్లాడుతున్నప్పుడు కూడా కెమెరాలు ప్రతి కదలికను మరియు ప్రతి సంభాషణను రికార్డ్ చేస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ని రికార్డ్ చేయవద్దని చెప్పినప్పటికీ రికార్డ్ చేసిందని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది క్రికెటర్ల గోప్యతను ఉల్లంఘిస్తుంది మరియు క్రికెటర్లపై నమ్మకాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు రోహిత్.

లక్నోతో మ్యాచ్‌కు ముందు రోహిత్ తన ముంబై స్నేహితుడు ధవల్ కులకర్ణితో మాట్లాడుతున్నాడు. అప్పుడు కెమెరామెన్ తన సంభాషణను రికార్డ్ చేయడం చూశాడు. రోహిత్ వెంటనే కెమెరామెన్‌ని ఆపి బ్రదర్, ఆడియోను ఆపివేయండని వేడుకొన్నాడు. కాగా దీనికి సంబంధించి రోహిత్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.అంతకుముందు కోల్‌కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది, అందులో అతను ముంబై ఇండియన్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాది రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని కూడా భావిస్తున్నారు.