బైకుల ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అనే పేరు వింటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. దాని సౌండ్, లుక్, రోడ్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.
ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైకులు చాలా మంది రైడర్ల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ లైనప్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది హంటర్ 350 (Hunter 350). హంటర్ 350ని రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత సరసమైన ధరలో అందించడం వల్ల ఇది మధ్యతరగతి యువతకు అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక అయింది. దాంతో హంటర్ 350 అమ్మకాలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఈ ధోరణి జూలై 2025లో మరింత బలంగా కొనసాగింది. గత ఏడాది ఇదే నెలలో (జూలై 2024) 14,091 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఏడాది జూలైలో 18,373 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం. అంటే ఒక్క ఏడాదిలోనే 4,282 యూనిట్ల అదనపు అమ్మకాలు సాధించింది. ఇది 30.39 శాతం వృద్ధి అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.
హంటర్ 350 అందించే స్టైల్, సౌకర్యం, రోడ్డుపై ఇచ్చే కమాండ్ ఫీలింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇతర 350 సీసీ బైకులతో పోలిస్తే తక్కువ ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కి ఉన్న విశ్వసనీయత కూడా కస్టమర్లను ఆకర్షించింది. ఈ పెరుగుదలతో హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మరింత శక్తిని అందించింది. రాబోయే నెలల్లో ఇదే జోరు కొనసాగుతుందని, కొత్త రైడర్లు బైక్‌ను తమ గ్యారేజీకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హంటర్ 350 తన అమ్మకాలలో నెలనెలా వృద్ధిని కొనసాగిస్తోంది. జూన్ 2025లో ఈ బైక్ అమ్మకాలు 16,261 యూనిట్ల వద్ద నిలిచాయి. అయితే, జూలై 2025 రాగానే సంఖ్య మరింత పెరిగి 18,373 యూనిట్లకు చేరింది. అంటే, ఒక్క నెలలోనే 2,112 అదనపు బైకులు అమ్ముడవ్వడం విశేషం. ఇది 12.99 శాతం వృద్ధి అని చెప్పుకోవచ్చు. ఈ వృద్ధి వెనుక హంటర్ 350కి ఉన్న డిమాండ్ కీలక పాత్ర పోషించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభించే బైకులలో ఇది అత్యంత చౌకైన మోడల్ కావడం దీని ప్రధాన బలం. బేస్ వేరియంట్ ధర కేవలం రూ.1,49,900 ఉండగా, టాప్ వేరియంట్ కూడా రూ.1,81,750 మాత్రమే (ఎక్స్-షోరూమ్). అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే ప్రతిష్ఠాత్మక బ్రాండ్ అనుభవాన్ని చాలా తక్కువ ధరలో అందించే బైక్ ఇది. ఈ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అనే మాటే చాలామందిని ఆకర్షిస్తోంది.
మార్కెట్లో పెరుగుతున్న పోటీ మధ్య ప్రతి నెలా అమ్మకాలను పెంచుకుంటూ పోతుండటం దీని విజయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. హంటర్ 350 ఇంజిన్ పరంగా శక్తివంతమైనదిగా, కానీ హ్యాండిల్ చేయడానికి తేలికైనదిగా నిలుస్తుంది. ఇందులో 349 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద గరిష్టంగా 20.2 bhp శక్తిని, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఈ ఇంజిన్ పనితీరుకు తోడు, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని జతచేయడం వల్ల సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేపై వేగంగా ప్రయాణించాలనుకున్నా సరైన అనుభూతిని ఇస్తుంది. ఇది 50 కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వగలదు. మరో విశేషం ఏమిటంటే, దీని మొత్తం బరువు కేవలం 181 కిలోలు మాత్రమే. హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కొంచెం హెవీగా ఉంటాయని భావించే రైడర్లకు, హంటర్ 350 సరైన ఆప్షన్.

































