ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజా రవాణాశాఖ ఉద్యోగుల సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముఖ్యంగా ఉచిత బస్సు పథకం సాఫీగా నడిచేందుకు సహకరిస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీరుతో పాటు ఇప్పటికే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమ్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టా ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
ఆర్టీసిలో ప్రవేశపెట్టే విద్యుత్ బస్సులు ప్రైవేటుకు ఇవ్వకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసి ద్వారానే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆర్టీసిలో ఉన్న 10వేల ఖాళీల భర్తీకి ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరింది. విద్యుత్ బస్సులతో పాటు అవసరమైన డీజల్ బస్సులు కొనుగోలు చేయాలని కూడా కోరింది. స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేస్తున్న ఉద్యోగులపై చిన్న తప్పులకు సస్పెన్షన్లు, శిక్షలు విధించడం తగదని ఈయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులపై అన్యాయంగా చర్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఇవాళ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసి పదోన్నతులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని వారు కోరారు. సుమారు 7 వేల మంది అర్హులకు ఇంకా పదోన్నతులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఏపీ ప్రజా రవాణాశాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహించి ఇందులో 26 జిల్లాల నాయకుల పాల్గొనడంతో కీలక తీర్మానాలు ఆమోదించారు.
ఏపిపిటిడి 28వ రాష్ట్ర మహాసభలు 2026 మార్చి-ఏప్రిల్‌లో ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. విలీనం అనంతరం రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్టీసి ఆసుపత్రుల్లో మందుల సరఫరా కొనసాగించాలని వారు కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై 30 డిమాండ్లతో ఆర్టీసీ వీసీ-ఎండీకి రెండురోజుల్లో లేఖ ఇవ్వనున్నట్లు ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, జి.వి.నరసయ్య తెలిపారు.




































