శబరిమల ఆలయం ఓపెన్, తేదీలు ఇవే – దర్శన టికెట్లు ఇలా

బరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తులం మాస పూజల కోసం అక్టోబర్ 17- 22 వరకు తెరవనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ప్రకటించింది.


ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత అక్టోబర్ 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపింది. దర్శనం కోసం వర్చ్యువల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల 17వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు తెరవనున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. ఇదే సమయంలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూతపూసిన రాగి తాపడాలను ఆలయం తెరిచిన వెంటనే అంటే అక్టోబర్ 17న ఏర్పాటు చేస్తామని ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు, ఆలయ ప్రధాన పూజారి నుంచి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలని అనుకునే భక్తులు వర్చువల్ క్యూ విధానంలో దర్శన టికెట్లు పొందొచ్చని తెలిపారు. తులం మాస దర్శనం కోసం బుకింగ్‌లు సోమవారం సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌ సైట్ sabarimalaonline.org ద్వారా ప్రారంభమయ్యాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఆన్‌లైన్ బుకింగ్ నుంచి మినహాయింపును ఇచ్చారు.

ప్రస్తుతం వర్చువల్ క్యూ వ్యవస్థను నిర్వహిస్తున్న కేరళ పోలీసులు భక్తుల భద్రత గురించి చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీ యాత్రికుల సంఖ్యను పరిమితం చేసే వర్చువల్ క్యూ వ్యవస్థను, అంచనా వేసిన రద్దీని నిర్వహించడానికి అమలు చేస్తున్నారు. కాగా, శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడంపై జరుగుతున్న వివాదంపై కేరళ దేవస్వమ్ మంత్రి కె. రాధాకృష్ణన్ స్పందించారు. శబరిమల వద్ద అన్ని కార్యకలాపాలు పూర్తి పారదర్శకతతో జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించిందని, నివేదికను అందిన తర్వాత నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.