లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా

ఆలస్యంగా బడికొచ్చినా సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారుఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌


పాఠ్యపుస్తకాలను పరిశీలించి సూచనలిస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

తణుకు, న్యూస్‌టుడే: లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు… ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి… ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ప్రశ్నించారు. శనివారం రాత్రి తణుకు ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా నూరుశాతం సాధించకపోవడానికి నిర్లక్ష్యమే కారణం. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారు’ అని అన్నారు.

ఒక్కొక్కరు 50 మందిని చూడలేరా? ‘ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీరు 50 ఇళ్లను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా. ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతీ యూనిట్‌లో 70శాతం మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు… ప్రజలందరిదని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ని కలువగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనియత విద్య బోధకులు, సూపర్‌వైజర్లు రాష్ట్ర సమగ్రశిక్షా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, సంచుల నాణ్యతను పరిశీలించి, నూతన పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు.