మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటోంది.


టీవీ చూస్తూ ఫుడ్ తింటే ఏమవుతుందంటే?
టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండినా అలాగే తింటూనే ఉంటారని చెప్తున్నారు. మోతాదుకు మించి భోజనం తీసుకుంటారట. అలా చేయడం ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

735 మంది విద్యార్థులపై అధ్యయనం
పోర్చుగల్‌లోని మిన్హో యూనివర్శిటీ 735 మంది యువ విద్యార్థులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది. టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేసిన విద్యార్థులలో ఊబకాయం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. యుకె లెక్కల ప్రకారం 11 సంవత్సరాల వయసున్న పిల్లలో 91 శాతం మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నట్లు తేలింది. అంతేకాదు, రోజుకు కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఆన్ లైన్ లో గడుపుతున్నారట. 16 ఏండ్ల లోపు వారు వారానికి కనీసం 5 గంటల పాటు టీవీ చూస్తున్నట్లు ఆఫ్కామ్ వెల్లడించింది.

ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మందికి ఊబకాయం
దాదాపు 40 శాతం మంది పిల్లలు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే సమయానికే అధిక బరువు లేదంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.“పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్‌ చూస్తూ ఫుడ్ తిన్నప్పుడు వాళ్లు ఎంత తింటున్నారో అర్థం కాదు. టీవీ, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా మోతాదుకు మించి భోజనం చేస్తారు. పరధ్యానంలో పడి ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఇలా చేయడం పిల్లలకు ఎంతో ప్రమాదకరం. వాళ్లు ఈజీగా బరువు పెరుగుతారు. మరికొంత మందిలో ఊబకాయం సమస్య తలెత్తుతుంది” అని పోర్చుగల్‌లోని మిన్హో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధలు చయిత్రి డాక్టర్ అనా డ్వార్టే వెల్లడించారు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల మాదిరిగా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదని చైల్డ్ గ్రోత్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ ఫ్రై వెల్లడించారు. “ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి, తల్లిదండ్రులు మరోసారి భోజనం చేస్తున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలకు బాగా అలవాటుపడిపోయారు. వారి ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది” అని వెల్లడిచారు.