Savings Account: సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండొచ్చు? నిపుణుల సూచనలు ఇవే

www.mannamweb.com


ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ (Bank Account) లేనివారు చాలా అరుదు. వివిధ సంక్షేమ పథకాల రాయితీలను లబ్ధిదారుల సేవింగ్స్ అకౌంట్‌కు (Savings Account) ప్రభుత్వాలు అందజేస్తున్నాయి.
అయితే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్‌ జర్నీ సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడంతోనే మొదలవుతుంది. ఈ అకౌంట్‌లో డబ్బు సురక్షితంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా తీసుకోవచ్చు. డిపాజిట్లపై వడ్డీ కూడా అందుతుంది. కానీ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉంచుకోవడం సరికాదు. ఆదాయాలను పెంచుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ సరైన మార్గం. అయితే ఒక వ్యక్తి సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఎంచుకోవడం మంచిది? దీనిపై ఒక నిర్ణయానికి ఎలా రావాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఆర్థిక స్థితి

సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచాల్సిన నిధులను నిర్ణయించేటప్పుడు ఆర్థిక స్థితి, ఆదాయం, ఖర్చులు, అప్పులు, భవిష్యత్తు లక్ష్యాలను రివ్యూ చేయాలి. అప్పులు ఉంటే, సేవింగ్స్‌ అకౌంట్‌కి ఎక్కువ నిధులు కేటాయించే ముందు, వాటిని క్లియర్‌ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పులు తీరిన తర్వాత సేవింగ్స్‌ పెంచుకోవాలి.
ద్రవ్యోల్బణం

కాలక్రమేణా ద్రవ్యోల్బణం డబ్బు కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ ద్రవ్యోల్బణంతో సమానంగా ఉండకపోవచ్చు. అంటే ఇది పొదుపు విలువ క్షీణతకు దారి తీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి, తక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అధిక రాబడిని అందించే ఆస్తులలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలి.

రిటర్న్స్‌

సేవింగ్స్‌ అకౌంట్లతో సేఫ్టీ, కన్వీనియన్స్‌ ఉంటాయి. అయితే వీటిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచడం వల్ల కలిగే నష్టాన్ని కూడా అంచనా వేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా స్టాక్‌లు వంటి ఇతర పెట్టుబడులతో పోలిస్తే సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ నిధులను పెట్టుబడులకు మళ్లించాలి. సేఫ్టీ, పొటెన్షియల్‌ రిటర్న్స్‌ బ్యాలెన్స్‌ చేయడానికి ఆర్థిక ఆకాంక్షలు, రిస్కు తీసుకునే సామర్థ్యం అంచనా వేయాలి.
నెలవారీ ఖర్చులు

తగిన సేవింగ్స్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ని నిర్ణయించేటప్పుడు నెలవారీ ఖర్చులు, క్యాష్‌ ఫ్లో పరిగణించాలి. రెంట్‌, యుటిలిటీలు, కిరాణా సామగ్రి, ఇన్సూరెన్స్‌ ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చులను కవర్ చేసే మొత్తాన్ని లెక్కించాలి. ఊహించని ఖర్చులు వచ్చినా కూడా తీర్చగలిగేలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వల్పకాలిక లక్ష్యాలు

విహారయాత్ర, ఇంటి డౌన్ పేమెంట్ లేదా ముఖ్యమైన కొనుగోలు వంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేయడానికి సేవింగ్స్‌ అకౌంట్‌లో డబ్బును మెయింటెన్ చేయవచ్చు. ఎంత కేటాయించాలనేది నిర్ణయించడానికి నిర్దిష్ట లక్ష్యాలను, వాటి టైమ్‌లైన్‌ని అంచనా వేయాలి. డెడికేటెడ్‌ అకౌంట్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ ఫండ్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రభావితం కావు.

ఎమర్జెన్సీ ఫండ్‌
సేవింగ్స్‌ అకౌంట్‌ ప్రాథమిక విధి ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయడం. మూడు నుంచి ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యపరమైన సంక్షోభాలు, ఉద్యోగ నష్టం లేదా పెద్ద మరమ్మతుల వంటి ఊహించలేని పరిస్థితుల నుంచి ఈ డబ్బు రక్షిస్తుంది.
Bankbazaar.com సీఈవో ఆదిల్ శెట్టి ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌’తో మాట్లాడుతూ.. ‘డబ్బును సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచితే సేఫ్టీ, యాక్సెసిబిలిటీ లభిస్తుంది. స్వల్పకాలిక అవసరాలు, అత్యవసర పరిస్థితులు, రోజువారీ ఖర్చుల కోసం ఈ ఖాతా నమ్మదగిన ఆప్షన్‌. అయితే సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌లు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తాయి. సంపదను నిర్మించడానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులను డైవర్సిఫై చేయడం అవసరం.’ అని చెప్పారు.