School fee: హైదరాబాద్‌లో హార్ట్‌ఎటాక్ తెప్పిస్తున్న స్కూల్ ఫీజలు.. LKG పిల్లాడి ఫీజు వింటే ఫ్యూజులు ఔట్

Hyderabad News: ఆయా విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి LKGకి మారుతున్న నాలుగేళ్ల పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు హార్ట్‌ ఎటాక్ వచ్చినంత పనైంది.
ఏకంగా 65 శాతం ఫీజుల పెంపును అమలు చేసినట్లు ఆ పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.


2023 విద్యా సంస్థలో 2.3 లక్షలుగా ఉన్న ఫీజులు 2024 నాటికి 3.7 లక్షలకు పెరిగాయని వారు పోస్ట్ చేశారు. తీరాచూస్తే ఆ పిల్లవాడు ఏప్రిల్‌లో LKG లో చేరబోతున్నాడని వెల్లడించారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు. IB కరిక్యులమ్‌కు మారడాన్ని ఇందుకు కారణంగా పేర్కొన్నట్లు చెప్పారు.

‘మా పిల్లవాడిని ఆ పాఠశాలలో చేర్పించినప్పుడు, గ్రేడ్ 1 వరకు ఫీజు సాపేక్షంగా, స్థిరంగా ఉంటుందని మేము భావించాము. అయితే నర్సరీ నుంచి LKGకి చేరుకోవడంతో కొత్త ఫీజు బ్రాకెట్‌లో ఉంచారు. ఇది దాదాపు 70 శాతం ఎక్కువ’ అని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే వారి పెద్ద కుమారుడు కూడా ప్రస్తుతం అదే పాఠశాలలో 4వ తరగతి చదువుతుండటం విశేషం.

ఇంకో విచిత్రం ఏమిటంటే LKGకి ఆ పాఠశాల వసూలు చేస్తున్న కొత్త ఫీజు 3.7 లక్షలు కాగా.. 4వ తరగతి విద్యార్థికి 50 వేలు తక్కువగా అంటే 3.2 లక్షలు తీసుకుంటున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ‘ఆర్థికంగా ఇది చాలా భారంగా ఉంటుంది. మేము ఇప్పుడు పిల్లవాడిని మరో పాఠశాలకు మార్చాలని ఆలోచిస్తున్నాము. అయితే ఇంత తక్కువ సమయంలో మరోచోట అడ్మిషన్ పొందడం మరొక సవాలు’ అంటూ మండిపడ్డారు.

‘ఈ ఏడాది నా కుమారుడిని 1వ తరగతిలో చేర్పించడానికి పాఠశాల కోసం వెతికాం. కూకట్‌పల్లిలోని దాదాపు 10 పాఠశాలలను సందర్శించాము. ఫీజులు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో అత్యల్పం 1 లక్ష. పాఠశాలలు క్లెయిమ్ చేసే విభిన్నమైన అంశం మౌలిక సదుపాయాలు. అయితే అకడమిక్స్ మరియు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జూనియర్ క్లాస్‌లకు ప్రాథమిక దృష్టిగా ఉండాలి’ అని మరో యూజర్ చెప్పుకొచ్చారు.

అయితే నగరంలోని పాఠశాలల నిర్వాహకులు ఈ ఫీజు పెంపును సమర్థించారు. ‘చాలా పాఠశాలలు ఈ సంవత్సరం రుసుములను 8 నుంచి 10 శాతం పెంచాయి. అనుభవజ్ఞులైన సిబ్బందిని నిలుపుకోవడానికి మార్కెట్‌తో పోటీపడి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఫీజుల పెంపులో మానవ వనరుల కోసం వెచ్చించే మొత్తమే అత్యధికంగా ఉంటోంది’ అని నగరంలోని CBSE స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధి పేర్కొన్నారు.