వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త.

సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు షాపింగ్ కార్ట్ వాడటం మనకు సర్వసాధారణం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు, వారిని కార్ట్‌లో కూర్చోబెట్టి హాయిగా షాపింగ్ చేస్తుంటారు.


అయితే మనం ఎంతో సురక్షితం అనుకునే ఈ షాపింగ్ కార్ట్‌లు ఇన్ఫెక్షన్ల నిలయాలని మీకు తెలుసా..? ఇటీవల ప్రముఖ వైద్యులు డాక్టర్ కునాల్ సూద్ వెల్లడించిన నిజాలు ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.

షాకింగ్ నిజాలు వెలుగులోకి..

అరిజోనా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. డాక్టర్ కునాల్ సూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అమెరికాలోని వివిధ నగరాల్లోని 85 షాపింగ్ కార్ట్‌లను పరీక్షించగా, వాటిపై భయంకరమైన స్థాయిలో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.

పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ల కంటే ప్రమాదకరమా?

ఈ అధ్యయనంలో తేలిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. మనం అసహ్యించుకునే పబ్లిక్ టాయిలెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల కంటే షాపింగ్ కార్ట్ హ్యాండిల్స్‌పైనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటోంది. మల సంబంధిత కాలుష్యం ద్వారా వచ్చే ఇ. కోలి బ్యాక్టీరియా షాపింగ్ కార్ట్ హ్యాండిల్స్‌పై అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పారిశుద్ధ్య లోపం వల్ల వచ్చే కోలిఫాం బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుంది?

షాపింగ్ కార్ట్‌లను ఎండలో, వానలో లేదా పార్కింగ్ స్థలాల్లో వదిలివేయడం వల్ల వాటి ఉపరితలంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. వినియోగదారులు ఆ హ్యాండిల్స్‌ను పట్టుకుని, అవే చేతులతో ముఖాన్ని తాకడం లేదా పిల్లలకు తినిపించడం వల్ల ఈ క్రిములు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ప్రమాదాన్ని తగ్గించుకోవడం ఎలా?

షాపింగ్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే డాక్టర్ కునాల్ సూద్ ఈ క్రింది సూచనలు చేస్తున్నారు:

డిసిన్ఫెక్టెంట్ వైప్స్: షాపింగ్ కార్ట్ హ్యాండిల్‌ను పట్టుకోవడానికి ముందు దానిని క్రిమిసంహారక వైప్స్‌తో శుభ్రం చేయండి.

హ్యాండ్ శానిటైజర్: షాపింగ్ పూర్తయిన వెంటనే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

పిల్లల విషయంలో జాగ్రత్త: పిల్లలను కార్ట్‌లో కూర్చోబెట్టేటప్పుడు, హ్యాండిల్స్‌ను వారు నోట్లో పెట్టుకోకుండా లేదా తాకకుండా జాగ్రత్త వహించాలి.

షాపింగ్ కార్ట్ అనేది మన సౌలభ్యం కోసం తయారు చేయబడింది. కానీ మన అజాగ్రత్త వల్ల అది ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి తదుపరిసారి సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు శానిటైజర్ లేదా వైప్స్ తీసుకెళ్లడం మర్చిపోకండి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.