సీతా స్వయంవరంలోని శివ ధనుస్సుని శ్రీ రాముడి కంటే ముందు ఎవరు ఎత్తారో తెలుసా..

www.mannamweb.com


వివాహ పంచమి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. సీతారాముల వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్గశీర్ష (మార్గశిర) మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు.

ఈ రోజున సీతారాములను పూజిస్తారు. వారి పవిత్ర బంధాన్ని స్మరించుకుంటారు. ఈ పండుగ మనకు రామాయణ కాలాన్ని గుర్తు చేస్తుంది. సీతా రాముల ఆదర్శ జీవితం గురించి చెబుతుంది. సీతారాముల మధ్య పవిత్ర సంబంధం భార్యాభర్తల బంధానికి ఆదర్శంగా పరిగణించబడుతుంది. ఈ రోజున, భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఒకరిపై ఒకరు ప్రేమను , గౌరవాన్ని వ్యక్తం చేస్తారు.

పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి డిసెంబర్ 05వ తేదీ మధ్యాహ్నం 12:49 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు డిసెంబర్ 06వ తేదీ మధ్యాహ్నం 12:07 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం వివాహ పంచమి పండుగను ఈ సంవత్సరం డిసెంబర్ 06 న జరుపుకోవాలని పండితులు సూచించారు.

రామాయణం కథ ప్రకారం జనక మహారాజు తన కుమార్తె అయిన సీత దేవి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ స్వయంవరంలో ఏ రాకుమారుడు శివుని ధనుస్సును ఎత్తి నారి సంధిస్తాడో అతనికి మాత్రమే తన కుమార్తె అయిన సీతను పెళ్లి చేసుకోగలడు అనే షరతును విధించాడు. సీతా స్వయం వారంలో రావణుడుతో సహా చాలా మంది యువరాజులు ఈ విల్లును ఎత్తడానికి ప్రయత్నించారు. ఎవరూ విజయవంతం కాలేదు. ఆఖరికి రాముడు వచ్చి సులువుగా శివ ధనుస్సును ఎత్తాడు. నారి సంధిస్తున్న సమయంలో ధనుస్సు విరిగింది. అయితే శ్రీరాముని కంటే ముందు శివ ధనుస్సును ఎవరు ఎత్తారో తెలుసా.

మొదట విల్లును ఎవరు తీశారు?

కొన్ని పురాణ కథల ప్రకారం సీత తన బాల్యంలో ఆడుకుంటూ తన ఎడమ చేతితో శివ ధనస్సుని ఎత్తినట్లు చెబుతారు. స్వయంవర సమయంలో సీతదేవి ఈ ధనుస్సును ఎత్తి స్వయంవరం జరుగుతున్న భవనం వద్దకు తీసుకొచ్చిందని చెబుతారు. కొన్ని వందల మంది కలిసినా శివ ధనుస్సు ఎత్తడానికి ఎంతో కష్టపడతారు. అటువంటి ధనస్సుని సీత దేవి చాలా సులభంగా ఎత్తగలదని జనక మహా రాజుకు తెలుసు.

ఈ విల్లు లంకాధీశుడు రావణుడి చేతిలో పడితే విశ్వం సర్వనాశనం అవుతుందని జనకుడు భయపడ్డాడు. రాముడు ఈ విల్లును ఒక చేత్తో ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాముడు శివ ధనుస్సు సంధించడానికి వింటి నారిని ( తీగను )పైకి లేపాడు. శివ ధనుస్సు వంచి నారిని సంధించాలనుకున్నాడు. అప్పుడు ఆ శివ ధనుస్సు విరిగింది.

శివ విల్లు శక్తి, ధైర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శ్రీ రాముడు లోక రక్షకుడు విష్ణువు అవతారం. శివ ధనస్సుని ఎత్తడం ద్వారా తన దైవిక శక్తిని ప్రదర్శించాడు. విల్లు విరిచి సీతను పెళ్లి చేసుకునే హక్కు రాముడు పొందాడు.

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.