భోపాల్: మంచానికి పరిమితమైన వృద్ధురాలైన తల్లిని కుమారుడు ఇంట్లో వదిలేసి తాళం వేశాడు. తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అయితే బెడ్ పైనుంచి లేవలేని ఆ వృద్ధురాలు ఆకలి, దప్పికతో మరణించింది.
(Son locks Mother, Dies OF Hunger) ఈ దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు ఆమె కుమారుడిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 80 ఏళ్ల లలితా దూబే తన కుమారుడు అరుణ్‌తో కలిసి భోపాల్‌లోని నిషాత్‌పురా ప్రాంతంలో నివసిస్తున్నది. అయితే మంచానికి పరిమితమై లేవలేని ఆమెను కుమారుడు ఇంట్లో ఉంచి లాక్ వేశాడు. తన భార్య, కొడుకుతో కలిసి ఉజ్జాయినికి వెళ్లాడు. ఇండోర్‌లో ఉంటున్న సోదరుడు అజయ్‌కు ఈ విషయం చెప్పాడు.
కాగా, మరో కుమారుడైన అజయ్ తన తల్లి పరిస్థితిపై ఆందోళన చెందాడు. భోపాల్‌లో ఉంటున్న తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన తల్లిని చూసి రావాలని కోరారు. ఆ ఇంటికి చేరుకున్న స్నేహితుడు ఆ వృద్ధురాలు మరణించినట్లు గమనించాడు. ఈ విషయాన్ని అజయ్‌కు చెప్పాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వృద్ధురాలైన లలితా దూబే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్న ఆమె 24 గంటలుగా ఏమీ తినకపోవడం, మంచినీరు తాగకపోవంతో ఆకలి, దప్పికతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అజయ్ ఫిర్యాదుతో ఆ వృద్ధురాలి కుమారుడైన అరుణ్‌పై సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.