భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ కంపెనీలు గత వారం రోజులుగా రష్యాకు చెందిన ముడి చమురు కొనుగోలును నిలిపివేశాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
రష్యన్ చమురుపై డిస్కౌంట్లు తగ్గిపోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలపై సుంకాలను విధిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, గత కొన్నేళ్లుగా రష్యా ముడి చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశంగా కొనసాగుతోంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ పరిణామాల మధ్య రాయితీలు తగ్గిన కారణంగా మన ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు కొనుగోలును ఆపేశాయని రాయిటర్స్ పేర్కొంది. వాటిలో ఇండియన్ ఆయిల్ కార్ప్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఉన్నాయి.
గత వారంలో రష్యన్ ముడి చమురును కొనలేదని సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. దీనిపై ఆయిల్ కంపెనీలు అధికారికంగా స్పందించల్సి ఉందని రాయిటర్స్ పేర్కొంది. ఈ ఆయిల్ కంపెనీలు సాధారణంగా డెలివరీ ప్రాతిపదికన రష్యన్ చమురును కొనుగోలు చేస్తాయి కానీ ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నాయి. ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన సంస్థలు ముఖ్యంగా మధ్యప్రాచయంలోని అబుదాబిలో ముర్బన్ ముడి చమురు, పశ్చిమ ఆఫ్రికా మార్కెట్లను ఆశ్రయిస్తున్నాయి.
ఇక, ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ అతిపెద్ద రష్యన్ చమురు కొనుగోలు కంపెనీలుగా ఉన్నాయి. ఈ కంపెనీలు రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పటికీ ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీలు మొత్తం 5.2 మిలియన్ బ్యారెళ్ల రోజువారీ శుద్ధి సామర్థ్యంలో 60 శాతం కంటే ఎక్కువ నియంత్రణను కలిగి ఉన్నాయి.
































