ఈ విషయాన్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎం.కె. ముఖర్జీ ఏకసభ్య కమిషన్ కీలకమైన అంశాలను బయటపెట్టింది. ఆ కమిషన్ నివేదిక ప్రకారం, నేతాజీ తైపే విమాన ప్రమాదంలో మరణించలేదని స్పష్టం చేసింది. అయితే ఆయన ఆ తరువాత ఏమయ్యారో మాత్రం నిర్ధారించలేకపోయామని చెప్పింది. ఈ నివేదికపై నేతాజీ కుటుంబ సభ్యుల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన మనవడు సూర్య కుమార్ బోస్, విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.
నేతాజీకి సంబంధించిన రహస్య పత్రం :
ఇంకొంతమంది పరిశోధకులు మాత్రం పూర్తిగా భిన్నమైన వాదనలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన పరిశోధకుడు ఇక్బాల్ చంద్ మల్హోత్రా ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో నేతాజీ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆయన జర్మన్ జలాంతర్గామి ద్వారా సింగపూర్ నుంచి వ్లాదివోస్టాక్ వెళ్లి, అక్కడి నుంచి సోవియట్ యూనియన్ చేరుకున్నారని ఆయన అభిప్రాయం. దీనికి తోడుగా, రష్యాలో ఎన్నేళ్లు గడిపిన భారతీయ పరిశోధకురాలు పురబీ రాయ్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. మాస్కో సమీపంలోని గూఢచారి సంస్థ ఆర్కైవ్స్‌లో నేతాజీకి సంబంధించిన ఒక రహస్య పత్రం ఉందని ఆమె తెలిపారు. ఆ పత్రం ప్రకారం, 1946లో స్టాలిన్ నేతాజీ భవిష్యత్తుపై తన సహచరులతో చర్చించినట్లు సమాచారం ఉందని ఆమె పేర్కొన్నారు.
స్టాలిన్ అవసరానికే వాడుకున్నారు :
కొందరు చరిత్రకారులు స్టాలిన్ నేతాజీని రాజకీయ అవసరాల కోసం సజీవంగా ఉంచి ఉండవచ్చని భావిస్తున్నారు. భారత రాజకీయాల్లో బ్రిటిష్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నేతాజీని ఉపయోగించాలని ఆయన అనుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది. స్టాలిన్ మరణానంతరం నేతాజీ పరిస్థితి ఏమైందన్నది మరింత రహస్యంగా మారింది.
ఈ బాబానే సుభాష్ చంద్రబోస్‌నా? :
ఇదే సమయంలో గుమ్నామి బాబా అనే సాధువు గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. ఆయన అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో ఎన్నేళ్లూ అజ్ఞాతంగా జీవించారు. ఆయనే నేతాజీ అని కొందరు నమ్మారు. దీనిపై విచారణలు జరిగినా, స్పష్టమైన నిర్ణయం మాత్రం వెలువడలేదు. రాజకీయ కారణాలు, భద్రతా ఆందోళనలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల నేతాజీ విషయంలో నిజం బయటకు రాలేదని చాలామంది భావిస్తున్నారు. అందుకే నేతాజీ జీవితం, మరణం ఇప్పటికీ భారతదేశానికి ఓ అతి పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.




































