పాత పెన్షన్ పునరుద్ధరణకు తమ వంతు కృషి చేస్తాం

ఖైరతాబాద్ : వృద్ధాప్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంతగానో దోహదపడే పాత పెన్షన్ ను సమిష్టిగా కృషి చేసి పునరుద్ధరించుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.


సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మల్లు రవి, సాధన సమితి కో-ఆర్డినేటర్ కృష్ణమూర్తి, వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది సుమారు 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనే కీలకమని అన్నారు. జీవిత చరమాంకంలో ఓవైపు వృద్ధాప్యం మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన పెన్షన్ సక్రమంగా రాకపోతే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. కంట్రీబుటరి పెన్షన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వడంలేదని, ఎన్నేళ్లు పనిచేసినా వృద్ధాప్యంలో తమ జీవితాలు ఎలా వెళ్లదీయాలని భయాందోళనకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత పెన్షన్ విధానాన్నిప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో భరోసా ఉంటుందని అన్నారు. మల్లు రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తమ వంతు కృషి చేస్తామని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ పాత పెన్షన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ నాయకులు కురుమన్న యాదవ్, సాయిబాబు, స్వామి, బాలచెనయ్య, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.