Surgery by Robot : విశాఖలో అవలీలగా శస్త్ర చికిత్సలు చేస్తున్న రోబోట్ మెషిన్

విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి రోబోటిక్ శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి భారతదేశంలోనే మొట్టమొదటిది అధునాతన ఫోర్త్ జెన్ – డావిన్సీ రోబో మెషీన్‌ ద్వారా అవలీలగా శస్త్ర చికిత్స చేసే సదుపాయాన్ని ప్రారంభించింది ఓ కార్పొరేట్ హాస్పిటల్.
విశాఖ లోని మెడికవర్ హాస్పిటల్స్ లో ఈ మొట్టమొదటి రోబోటిక్ ఇన్స్టిట్యూట్ లో అధునాతన ఫోర్త్ జెన్ – డావిన్సీ రోబో మెషీన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. శస్త్రచికిత్సా విధానాలను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ అధునాతన యంత్రాన్ని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ ప్రారంభించారు.


అతి చిన్న కోతతో సర్జరీ

అతి చిన్న కోత తో సర్జరీ విజయవంతంగా చేసే అవకాశం ఈ రోబో సహాయంతో సర్జన్లకు కలుగుతుంది. రోగులకు సైతం అద్భుతమైన ప్రయోజనాలను ఇది అందిస్తుందట. ఫోర్త్ జెన్ – డావిన్సీ రోబో సహాయంతో అతి సూక్ష్మ విభాగాలు మరియు బ్లాక్ లలో కూడా శస్త్రచికిత్సలను ఖచ్చితంగా నిర్వహించవచ్చనీ నిపుణులు వివరించారు.
మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ తక్కువ కోతతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సమర్థవంతంగా చేయడంలో సాధిస్తున్న పురోగతిలో ఇది మరో మైలురాయన్నారు. ఈ తాజా జోడింపు శస్త్రచికిత్స ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందనీ, కటి భాగం తో పాటుగా ( ఉరఃకుహరము) థొరాసిక్ క్యావిటీ వంటి చిన్న ప్రదేశాలకు, చిన్న కోతలతో చేరుకోవచ్చన్నారు దీని వల్ల రోగి మరింత వేగంగా కోలుకోవచ్చని అన్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారం…

డాక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్‌ చికిత్స మరియు జనరల్ సర్జరీలలో అవసరమైన వారికి, మరీ ముఖ్యంగా అత్యుత్తమ, అధునాతన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఫోర్త్ జెన్ – డావిన్సీ రోబో మెషిన్ సహాయపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సు, వణుకు లేని కదలిక మరియు యంత్రం యొక్క సామర్థ్యం కారణంగా సర్జన్లు ప్రయోజనం పొందుతారన్నారు.అంతేకాకుండా, రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు అతి తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, తక్కువ ఇన్ఫెక్షన్ ప్రమాదం మరియు తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండడం వంటి ప్రయోజనాలను పొందుతారని వివరించారు.

వైద్య నిపుణులు ఈ పరికరం పనితీరును వివరిస్తూ ప్రతేకంగా గైనకాలజీ, హిస్టెరెక్టమీ పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్లు, పైలోప్లాస్టీ మరియు ఆగ్మెంటేషన్ ప్రక్రియ వంటి యూరాలజీ విధానాలు, కిడ్నీ క్యాన్సర్‌లు పాక్షిక మరియు రాడికల్ నెఫ్రెక్టమీ, మల మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌లు, ఇంటర్‌స్పింక్టెరిక్ రిసెక్షన్, శాశ్వత కోలోస్టోమీ మరియు ఊపిరితిత్తుల వంటి వాటిని తక్కువకోతతో ఎక్కడ ఓపెన్ సర్జరీస్ లో చేయలేనివాటిని ఈ అధునాతన రోబో ద్వారా నిర్వహించ వచ్చన్నారు. అన్ని విభాగాల్లో అధునాతన రోబోటిక్స్ కలిగి,వాటి కోసం ప్రత్యేక ఇన్స్టిట్యూట్ కలిగిన సదుపాయాలు విశాఖ లో ఉన్నాయని వివరించారు.