రూ.93 వేలకే OBD2B ప్రమాణాలతో సుజుకీ కొత్త స్కూటర్లు

భారతదేశంలో పర్యావరణ ప్రమాణాలు కఠినతరం అవుతున్న కొద్దీ, వాహన తయారీదారులు తమ వాహనాలను OBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల అవుతున్న మోడళ్లు కూడా ఇదే విధమైన ప్రమాణాలతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి(suzuki) OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినటువంటి రెండు స్కూటర్లను విపణిలోకి తాజాగా విడుదల చేసింది. ఆ మోడళ్ల పేరు అవెనిస్ (avenis), బర్గ్‌మాన్ (burgman). వీటిని భారతీయ పేద, మధ్య తరగతి కస్టమర్ల కోసం బడ్జెట్ ధరలో అందిస్తుంది. అవెనిస్ మోడల్ ధర రూ. 93,200 కాగా, బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ ధర వచ్చేసి 95,800గా కంపెనీ నిర్ణయించింది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.


OBD-2B ప్రమాణం అంటే ఏమిటి?: ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాలు. వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి మెరుగైన మానిటరింగ్ చేస్తుంది. ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఎగ్జాస్ట్ గ్యాస్‌లు మొదలైన వివరాలను రియల్-టైం ట్రాక్ చేయగలదు. ఇంజిన్ లైట్స్ లేదా ఎమిషన్ సంబంధిత సమస్యలు గుర్తిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించేందుకు ఈ ప్రమాణాలను ఇంజిన్‌లో అందిస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సుజుకీ అవెనిస్, బర్గ్‌మాన్ స్కూటర్లు ఈ ప్రమాణాలతో రావడం వలన ఇవి రోడ్డుపై తక్కువ స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. పైగా పెర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. సుజుకీ అవెనిస్ విషయానికి వస్తే, ఇది స్టైల్, పనితనం, మరింత ఇంధన కెపాసిటీని సమగ్రంగా అందించే స్కూటర్. ప్రధానంగా రెగ్యులర్ వెర్షన్, స్పెషల్ ఎడిషన్ అనే వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.

అవెనిస్ రెగ్యులర్ వెర్షన్ ధర రూ. 93,200 కాగా, అదే స్పెషల్ ఎడిషన్ చూసినట్లయితే రూ. 94 వేల ధరకు లభిస్తుంది. ఈ కొత్త మోడల్‌లో సీటింగ్ డిజైన్ చాలా ప్రత్యేకంగా మారింది. ఇది కేవలం కంఫర్ట్ మాత్రమే కాకుండా, లుక్స్ పరంగా కూడా ప్రీమియం ఫీల్ అందిస్తుంది. ప్రత్యేకించి, మెటాలిక్ మ్యాట్, మ్యాట్ టైటానియం సిల్వర్ కలర్స్ స్కూటర్‌కు మరింత స్టైలిష్ లుక్ తీసుకు వచ్చాయి.

యువతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఒక స్పోర్టీ స్కూటర్. అందుకే, స్టైలింగ్, ఎఫిషియన్సీ, డిజైన్ లాంటి అంశాలలో ఏ మాత్రం రాజీపడకుండా మార్కెట్‌లో ట్రెండ్ సెట్ చేసేలా తీర్చిదిద్దారు. కొత్త కలర్ థీమ్‌తో ఇది మరింత స్టైలిష్‌గా మారింది. ఈ స్కూటర్‌లో 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ 124.3cc మోటార్ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ డిజైన్ ప్రత్యేకత ఏమిటంటే, రన్నింగ్‌లో సౌండ్ తక్కువగా వస్తుంది.

ఇది రైడింగ్ అనుభవాన్ని మరింత సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా మార్చేలా ఉంది. గరిష్టంగా 8.5 BHP పవర్, 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, స్కూటర్‌కి అవసరమైన పవర్‌ను అందిస్తుంది. మైలేజ్ పరంగా కస్టమర్లు సంతృప్తి చెందేలా ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది పట్టణ, గ్రామీణ ప్రయాణాలకు సరిపోయేలా ఉంటుంది. ఇక బర్గ్‌మాన్ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బర్గ్‌మాన్ స్ట్రీట్, స్ట్రీట్ EXలో ఒకే మోటార్ ఉంటుంది.

బర్గ్‌మాన్ స్ట్రీట్ పూర్తిగా అల్యూమినియం తయారీ 124cc, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.7 PS పవర్, 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే, బర్గ్‌మాన్ స్ట్రీట్ EX వేరియంట్ 8.6 PS పవర్, 10 Nm టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా తక్కువ సౌండ్‌ను బయటకు విడుదల చేస్తుంది.