ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం – ఉబ్బలమడుగు జలపాతం /సిద్ధేశ్వర కోన జలపాతం /తడ జలపాతం

ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం – ఉబ్బలమడుగు జలపాతం /సిద్ధేశ్వర కోన జలపాతం /తడ జలపాతం


ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు , తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లాలు జలపాతాలకు పెట్టింది పేరు. అలాంటి చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల సరిహాద్దు ప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం కలదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకొన అని పిలువబడే అడవిలో ఈ సుందర జలపాతం కలదు. తిరుపతి నుండి ఈ జలపాతం 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. వరదయ్యపాలెం నుండి ఉబ్బలమడుగు కు రోడ్డు సౌకర్యం కలదు. అందుకే పర్యాటకులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉబ్బలమడుగు. వాహనాల్లో వెళితే 75 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిందే. అతి భయంకరమైన డీప్‌ ఫారెస్ట్ ఇది. ఎంతో అందంగా చల్లటి వాతావరణం ఉంటుంది. ఎంత దూరం నడిచినా అలసట రాకుండా ఎంతో చల్లగా ఉంటుంది ఉబ్బలమడుగు. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నా అక్కడక్కడ చిన్న చిన్న కొలనులు కనిపిస్తుంటుంది. దీంతో అక్కడక్కడ పర్యాటకులు కొలనుతో దిగి ఎంజాయ్‌ చేస్తున్నారు. నీళ్ల మీద కట్టిన బ్రిడ్జి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరోవైపు చెక్‌ డ్యాంలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. యువత కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఈ ప్రాంతంలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఉబ్బలమడుగు ఎంట్రన్స్ నుంచి జలపాతాల వద్దకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లకుపైగా నడిచి వెళ్ళాల్సిందే. 10 కిలోమీటర్లు నడిచినా అలసట ఉండదంటే ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఎంత వేడి ఉన్నా ఈ ప్రాంతంలో మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అది ఇక్కడి ప్రత్యేకత.

ఇక జలపాతాల వద్దకు వెళితే మనల్ని.. మనం మరిచిపోవాల్సిందే. అంత చల్లటి ఆహ్లాదకర వాతావరణం. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఉబ్బలమడుగుకి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు ఉబ్బలమడుగులో వందేళ్ళ చరిత్ర కలిగిన సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఇది ఎంతో పురాతనమైనది. ఇక్కడి శివలింగం స్వయంభుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. దీంతో భక్తులు ముందుగా సిద్ధేశ్వరాలయానికి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాతనే జలపాతాల వద్దకు పయనమవుతున్నారు.
ఎండ వేడిమిగా ఎక్కువగా ఉండడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తలకోన, ఉబ్బలమడుగు, సదాశివకోన, కైలానకోనలు పర్యాటకులతో సందడిగా మారాయి. ఆదివారాలైతే మరింత మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు.

వంద అడుగుల లోతు ఉన్నప్పటికీ.. కేవలం పది అడుగుల లోతే ఉంటుందని భ్రమ కల్పించే స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. సిద్ధేశ్వర స్వామి పాదాలను తాకుతూ.. పరవళ్లు తొక్కుతూ.. కిందికి దూకుతుంటుంది సిద్ధేశ్వర కోన జలపాతం. సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, యాత్రికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ.. రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాళెం మండలాల సరిహద్దుల్లో ఉబ్బలమడుగు జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. తొట్టంబేడు మండలం బోనుపల్లి నుంచి సత్యవేడు దాకా సాగిపోతున్న కొండకోనల మధ్య పచ్చని ప్రకృతి ప్రాంతమే ఇది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ అందమైన ప్రాంతంలోనే సిద్ధేశ్వర కోన ఉంది. ఇక్కడ శివయ్య సిద్ధులయ్యగా పూజలందుకుంటూ సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు.
మహా శివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు సిద్ధేశ్వర కోనకు తరలివచ్చి.. సిద్ధులయ్యను దర్శించుకుని ఆ కీకారణ్యంలోనే నిద్రిస్తుంటారు. దీనికి ఎగువన, దిగువన జలపాతాల హోరు నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. ఈ జలపాతాల నీరు ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంటుంది. ఇవి దూకే చోటు నుంచి కాస్త దిగువన నీటి కాలువలు ఉంటాయి. వీటినే ఉబ్బలమడుగులు అని స్థానికులు పిలుస్తుంటారు.
ప్రమాదాలకూ నిలయం..!
ఈ సుందర జలపాతాల హోరుతో పులకింపజేసే ఈ ప్రాంతం కొంతమందికి సౌందర్య దేవత అయితే, మరికొందరికి మృత్యుదేవతగా మారుతోంది. ఇక్కడి స్వచ్ఛమైన నీటి ప్రవాహం మృత్యుద్వారాలను తెరిచి.. ఎందరో యువకుల పాలిట యమపాశంలా మారుతోంది. ఉబ్బల మడుగు సుందర ప్రదేశమే కాకుండా…

ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం లేనే లేదని చెప్పవచ్చు.
ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న సరస్సు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. కొండలమీదుగా ఈ జలపాతం వద్దకు వెళ్లలేని పర్యాటకులు ఈ సరస్సు వద్దే స్నానాలాచరించి.. ఇక్కడే సేదతీరుతుంటారు.

ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా.. వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. శివరాత్రి పండుగ సందర్భంగా దాదాపు నాలుగు రోజులపాటు భక్తులు, పర్యాటకులు, స్థానికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దాంతో తాత్కాలికంగా కరెంటు సౌకర్యంతోపాటు వివిధ దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తుంటాయి.
ఇక శివరాత్రి పండుగకు రెండు రోజుల ముందుగానే సిద్ధేశ్వర కోన ప్రాంతానికి చుట్టుప్రక్కల నివసించే గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలివస్తుంటారు. మూడు రోజులపాటు అక్కడే వంటావార్పూ చేసుకుని సిద్ధులయ్యను తనివితీరా దర్శించి పూజలు జరపటం ఆ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. అయితే, సాధారణంగా పర్యాటకులు చీకటిపడే సమయానికి వరదయ్యపాళెం చేరుకుంటుంటారు.వరదయ్యపాళెం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దాకా తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేరకు మట్టిరోడ్డు సౌకర్యం ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా వెళుతుంటాయి. అయితే ఉబ్బలమడుగు జలపాతాన్ని చూడాలంటే మాత్రం కాలినడకన పైకి వెళ్లక తప్పదు. వారాంతాల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అయితే ఎవరయినా సరే ఇక్కడికి వెళ్లాలంటే బృందాలుగా వెళ్లటం శ్రేయస్కరం.

Watch this video