చికెన్ కర్రీ లాంటి మాంసాహార వంటకాలు పాత తరం వాళ్లు చాలా ఈజీగా, కమ్మగా చేసేవాళ్లు. ఇప్పటికీ పల్లెటూళ్లకు వెళ్లినపుడు అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టే పచ్చళ్లు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. సరిగ్గా పాత పద్ధతులు కొత్త స్టైల్లో ట్రై చేస్తే కొత్త ప్రయోగమే అవుతుంది. ఓ సారి ఇలా చికెన్ కర్రీ కుక్కర్లో చేసి చూడండి. ఎంతో టేస్టీగా, ప్రతి ముక్క జ్యూసీగా నోటికి కమ్మగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు :
- చికెన్ – 1 కేజీ
- ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – అర స్పూన్
- మిరియాలు – 1 స్పూన్
- దాల్చిన చెక్క – చిన్నది
- అనాసపువ్వు – 1
- జాపత్రి -1
- యాలకులు – 4
- లవంగాలు – 5
- నువ్వులు – 1 స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1.5 టేబుల్ స్పూన్
- 3 ఉల్లిపాయలు – మీడియం సైజు
- పచ్చిమిర్చి – 3
- పుదీనా – కొద్దిగా
- కరివేపాకు – కొద్దిగా
- పసుపు – అర స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – కొద్దిగా
- నూనె – 4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
- ముందుగా చికెన్ కర్రీలోకి అవసరమైన మసాలా రెడీ చేసుకోవాలి. కడాయి పొయ్యి మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, 1 అనాసపువ్వు, జాపత్రి, 4 యాలకులు, 5 లవంగాలు వేసుకుని సన్నటి మంటపై కలర్ మారే వరకు వేయించాలి.
- లైట్ గా కలర్ మారే వరకు వేయించి చివర్లో నువ్వులు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి.
- మరో వైపు ఉప్పు, నిమ్మరసం వేసి చికెన్ శుభ్రం చేసుకుని తీసుకోవాలి.
- ఇపుడు కుక్కర్ స్టవ్‌పై పెట్టుకుని నూనె వేసి మీడియం సైజు 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చికెన్, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి.
- నాలుగైదు నిమిషాలు చికెన్ వేయించాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కలపాలి. ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుని చికెన్ నీళ్లు వదిలిన తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న చికెన్ మసాలా వేసి గ్రేవీకి సరిపడా వేడి నీళ్లు పోసుకుని కలపాలి.
- ఇపుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్‌లో 1 విజిల్ ఇచ్చి ఆ తర్వాత ప్రెజర్ పోయాక మూత తీసుకోవాలి. ఆ తర్వాత మరో 3 నిమిషాలు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీగా ఉంటుంది.
































